- ఇక్కడి ప్రతి బస్తీలో నేను తిరిగిన
- ఎన్నికల్లోపు పాతబస్తీ మెట్రో పూర్తి
- అసదుద్దీన్ దేశ భక్తిని శంకించొద్దు
- మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకునే
- తెలంగాణ బీజేపీ నేతలు గుజరాత్ గులాములు
- సబర్మతికి మద్దతిచ్చి.. ఇక్కడ అడ్డుపడుడేంది
- రేవంత్ కోసమే కాంగ్రెస్‌కు మద్దతు: అసద్
- సైదాబాద్ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సీఎం
హైదరాబాద్, వెలుగు: పేదల భూములను తమ ప్రభుత్వం లాక్కోదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బడాబాబులు భూములను కబ్జా చేస్తే మాత్రం ఊరుకోబోదని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతం ఓల్డ్ సిటీ కాదని.. అది ఒరిజినల్ సిటీ అని అన్నారు. వచ్చే ఎన్నికల్లోపే పాతబస్తీ మెట్రో విస్తరణ పూర్తి చేస్తామని, మెట్రోలోనే వచ్చి ఓట్లు అడుగుతామన్నారు. హైదరాబాద్ మహానగరాన్ని తాను అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు పని చేస్తుంటే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మాత్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తున్నాయని మండిపడ్డారు. చంచల్‌గూడ–సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ మెట్రో విస్తరణ పనులను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్ కుట్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించిందని ఆరోపించారు. బినామీల ద్వారా పిటిషన్లు వేయించి ప్రజా ప్రాజెక్టులను నిలిపివేయాలని చూసిన విపక్షాల యత్నాలు ఫలించలేదన్నారు. గుజరాత్‌లో సబర్మతికి మద్దతిచ్చే బీజేపీ నేతలు గుజరాత్‌కు బానిసలుగా మారి.. మూసీ వంటి రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తుందని, ఎవరినీ రాజకీయ కోణంలో చూడదని రేవంత్ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలు, వ్యాపారులు ఫోన్లలో మాట్లాడాలన్నా తీవ్ర భయాందోళనలకు గురయ్యారని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అణచివేత, వేధింపులు లేవని, పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాలో ఉన్న ప్రతి పైసాను ప్రజా సంక్షేమం, బస్తీల మౌలిక సదుపాయాల కోసమే ఖర్చు చేస్తామన్నారు. అల్లుడు అత్తగారింటికి వచ్చినట్లుగా తనను ఆహ్వానించారని, పనులన్నీ పూర్తి చేశాకే మళ్లీ ఇక్కడికి వస్తానన్నారు.
డిసెంబర్ నుంచి మెట్రో విస్తరణ పనులు..
పాతబస్తీ మెట్రో విస్తరణ ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, వచ్చే డిసెంబర్ నుంచే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం తరఫున పైసలు ఇచ్చే బాధ్యత తనదని, రోడ్డు విస్తరణకు అవసరమైన ఆస్తులు, స్థలాలను ఇప్పించే బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులే తీసుకోవాలని తాను ముందే స్పష్టం చేశానని చెప్పారు. మెట్రో మార్గం కోసం మొత్తం 900 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, ఇప్పటికే 850 ఆస్తుల సేకరణ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఇంకా 50 ఆస్తుల సేకరణ మాత్రమే మిగిలి ఉందని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చానని పేర్కొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో నేరుగా మాట్లాడి, ఆయా ఆస్తుల యజమానులు ఎంత పరిహారం అడిగితే అంత చెల్లించి వెంటనే స్థలాలను క్లియర్ చేయాలని మంత్రికి నిర్దేశించానని చెప్పారు. ‘‘మీరంతా సహకరించి పనులు చేయించుకుంటే.. రాబోయే రెండున్నరేళ్లలో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మన మెట్రో వచ్చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మేం ఇదే మెట్రో రైలు ఎక్కి పాతబస్తీకి వచ్చి మీ ఓట్లు అడుగుతాం. ఆ మాట మీద నేను ఈ రోజుకీ నిలబడి ఉన్నాను. అందుకే వెనకపడి మరీ పనులను పరిగెత్తిస్తున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలకు వెళ్లే పేద మైనార్టీ కుటుంబాలకు ఈ ఎయిర్‌పోర్ట్ మెట్రో కనెక్టివిటీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
పాతబస్తీని ‘ఒరిజినల్ సిటీ’గా గుర్తిస్తున్నం..
పాతబస్తీని కేవలం ఓల్డ్ సిటీగా కాకుండా హైదరాబాద్ అసలైన ‘ఒరిజినల్ సిటీ’గా గుర్తిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకులు కొబ్బరికాయలు కొట్టి నిధులు ఇవ్వకుండా పాతబస్తీని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రేవంత్ ఆరోపించారు. గత 70 ఏళ్లలో 18 మంది సీఎంలు మారినా ఇక్కడి ప్రజల మనసులు గెలుచుకోలేకపోయారని చెప్పారు. తాను ఎక్కడి నుంచో రాలేదని, పెళ్లికి ముందే ఈ గల్లీల్లో తిరిగిన పూర్తి అనుబంధం తనకు ఉందన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తన మిత్రులని, వారి కోరిక మేరకే ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తున్నట్టు చెప్పారు. పాతబస్తీని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు నిధుల కొరత లేకుండా చూస్తామన్నారు. మలక్‌పేట ఎమ్మెల్యే బలాల విమెన్స్ డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం కోసం రూ.20 కోట్ల నిధులు కోరారని తెలిపారు. ఆడపిల్లల ఉన్నత విద్య కోసం తక్షణమే రూ.25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. పాతబస్తీ ముఖచిత్రాన్ని మార్చేలా రోడ్లు, డ్రైనేజీ, వంతెనల పనులను వేగవంతం చేస్తున్నట్లు రేవంత్ చెప్పారు. మీరాలం చెరువుపై ప్రపంచంలోనే అత్యుత్తమ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పటికే రూ.400 కోట్లు కేటాయించామన్నారు.
అసదుద్దీన్ దేశభక్తి.. మోదీ, అమిత్‌షా కన్నా తక్కువేం కాదు..
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దేశభక్తిని శంకించే హక్కు దేశంలో ఎవరికీ లేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా పోరాడడం వేరని, దేశ రక్షణ విషయంలో అసద్ ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. నాడు కార్గిల్ యుద్ధం, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత సైన్యం విజయం కోసం నెక్లెస్ రోడ్డులో ప్రార్థనలు చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కంటే అసదుద్దీన్ దేశభక్తి ఏమాత్రం తక్కువ కాదన్నారు. లండన్‌లో బారిస్టర్ చదివిన అసద్ ప్రపంచ వేదికలపై భారత వాణిని బలంగా వినిపిస్తున్నారని ప్రశంసించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడిన ఆయన.. బాధ్యతగల పదవుల్లో ఉన్నప్పుడు సమన్వయంతో నడుస్తున్నారని తెలిపారు. తాము అధికారం, రాజకీయాల కంటే స్నేహ బంధానికే ఎక్కువ విలువిస్తామని, ఒవైసీతో ఉన్నది సహజ స్నేహమని చెప్పారు. భయపెట్టి తనను ఎవరూ లొంగదీసుకోలేరని, కేవలం ప్రేమ, స్నేహంతో మాత్రమే తనను గెలుచుకోగలరని చెప్పారు. రాబోయే పాతికేళ్ల పాటు కలిసి పనిచేసి పాతబస్తీని ఘనమైన వారసత్వంతో నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కాగా, బహిరంగ సభలో ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. రేవంత్ కోసమే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని తెలిపారు.
ప్రజల నుంచి దరఖాస్తు వస్తే
నేను ఎవరినీ వట్టి చేతులతో వెనక్కి పంపించను. నా దగ్గరికి ఏదైనా దరఖాస్తు వస్తే.. అది ఎంఐఎం ఎమ్మెల్యే తెచ్చిన దరఖాస్తు అయినా సరే, నేను దానికి రాజకీయ రంగు పూసి చూడను. నేను చూసేది ప్రజల సమస్యను మాత్రమే. ప్రజలకు సౌలత్‌లు కల్పించడమే నా లక్ష్యం. మీ అందరి దీవెనల వల్లే ఈ ప్రభుత్వం ఏర్పడింది. అందుకే చెబుతున్నా.. పనులు తీసుకోండి, పైసలు తీసుకోండి, పనులు చేయించుకోండి. ఎవరైనా పనులను ఆపేందుకు ప్రయత్నిస్తే మీరే నాతో కలిసి నిలబడి ఆ సమస్యను తుడిచిపెట్టేయండి
- సీఎం రేవంత్ రెడ్డి
మెట్రోలో వచ్చి ఓట్లడుగుతా..
మీరంతా సహకరించి పనులు చేయించుకుంటే.. రాబోయే రెండున్నరేళ్లలో గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మన మెట్రో వచ్చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మేం ఇదే మెట్రో రైలు ఎక్కి పాతబస్తీకి వచ్చి మీ ఓట్లు అడుగుతాం. ఆ మాట మీద నేను ఈ రోజుకూ నిలబడి ఉన్నా. అందుకే వెనకపడి మరీ పనులను పరుగెత్తిస్తున్నా. - సీఎం రేవంత్‌రెడ్డి
