హైదరాబాద్, వెలుగు: దేశంలో రాజ్యసభ ప్రతిపక్ష నేత హోదాలో ఉంటూ, జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు సైతం కుల వివక్ష తప్పలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఓ సభలో మల్లికార్జున ఖర్గే పాల్గొన్న అనంతరం.. ఆ సభా ప్రాంగణాన్ని బీజేపీ, దాని అనుబంధ సంఘాలు శుభ్రం చేయడం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఘటనను లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎత్తిచూపితే, బీజేపీ నేతలు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో బీజేపీ నేతలు గాడ్సే పాలనను కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, వారి సంక్షేమంపై తమకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో దేశ ప్రజలందరికీ తెలుసని, ఈ విషయంలో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
