‘కొండా’పై చర్యల వెనుక కీలకంగా క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్

‘కొండా’పై చర్యల వెనుక  కీలకంగా క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్
  •     దురుసు మాటలతో ప్రభుత్వాన్ని తరచూ ఇరకాటంలో పెడ్తున్నారు
  •     ఆమెపై చర్యలు తీసుకోకపోతే  ప్రభుత్వానికి, పార్టీకి నష్టం
  •     సురేఖ బర్తరఫ్ ​తర్వాత ఏఐసీసీకి పంపిన నివేదికను మీడియాకు  రిలీజ్ చేసిన పీసీసీ

హైదరాబాద్, వెలుగు: మంత్రి హోదాలో ఉండి వివిధ సందర్భాల్లో కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, తాజాగా ఆమె కూతురు చేసిన ఆరోపణలు పార్టీకి, ప్రభుత్వానికి నష్టం కలిగించేలా ఉన్నాయని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఏఐసీసీకి రిపోర్ట్​ ఇచ్చింది. 33 పేజీల ఆ నివేదిక ఆధారంగానే హైకమాండ్​సురేఖపై చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. కాగా, కొండా సురేఖపై ఏఐసీసీకి పీసీసీ క్రమశిక్షణ కమిటీ పంపిన 33 పేజీల నివేదికను ఆమె బర్తరఫ్ అనంతరం మీడియాకు విడుదల చేసింది. 

కొండా సురేఖ మంత్రిగా రెండున్నరేండ్ల పాటు పనిచేసిన కాలంలో సొంత పార్టీ నేతలు, సహచర మంత్రులు, చివరకు కేటీఆర్ పై, సినీ హీరో నాగార్జునపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, దానివల్ల పార్టీకి, ప్రభుత్వానికి జరిగిన నష్టం గురించి ఆ నివేదికలో క్రమశిక్షణ కమిటీ స్పష్టంగా వివరించింది. ఇందుకు సంబంధించిన తెలుగు, ఇంగ్లిష్​పేపర్లలో వచ్చిన వార్తలు, విశ్లేషణలకు సంబంధించిన క్లిప్పింగులను రిపోర్ట్​కు జతచేసింది. సురేఖ ఓఎస్డీ సుమంత్ దురుసు ప్రవర్తన, బ్లాక్​మెయిలింగ్,​ ఆయనపై నమోదైన కేసులు, ఆయన దాడిలో గాయపడ్డ బాధితులు, వాళ్లకు అందిన ట్రీట్​మెంట్, అందుకు  సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పత్రికల్లో వచ్చిన కటింగ్ లను కూడా జోడించింది. 

మంత్రి, ఆమె కుటుంబ సభ్యుల మాటల దురుసుతో ప్రభుత్వం ఇరకాటంలో పడుతున్న తీరును సోదాహరణంగా వివరించింది. అటు ఓఎస్డీ అరాచకాల వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు ఎలా భంగం వాటిల్లుతున్నదీ పేర్కొన్నది.  సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం కొండా సుస్మిత వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వారి అభిప్రాయాలను కూడా జతచేసి పంపించింది. చివరగా ఈమెపై పార్టీ పరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని, లేదంటే రాబోయే రోజుల్లో  రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడనుందని నివేదించింది. దీంతో కొండా సురేఖ బర్తరఫ్ కు పీసీసీ క్రమశిక్షణ కమిటీ పంపించిన నివేదికనే కీలకంగా మారింది.