హైదరాబాద్, వెలుగు: ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రజా మేధావి ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసులు పెట్టడం అన్యాయమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దశాబ్దాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై ప్రజలను చైతన్యపరుస్తున్న నాగేశ్వర్‌ను రాజకీయాల్లోకి లాగడం సరికాదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను కొన్ని రాజకీయ పక్షాలు తప్పుగా అర్థం చేసుకున్నాయని, వాటిపై ఆయన వివరణ ఇస్తూ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించినా కేసులు పెట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మేధావుల అభిప్రాయాలను గౌరవించాలని సూచించారు. నాగేశ్వర్‌పై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. మేధావుల గొంతు నొక్కే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు.
