- కృష్ణాజలాలపై త్వరలో కార్యాచరణ..
- అవసరమైతే పాదయాత్ర: కేసీఆర్
- పదే పదే నా చావు కోరుతున్న వ్యక్తితో అసెంబ్లీలో చర్చకు ఎలా వస్తాను?
- 22ఏ జాబితాలోకి పేదల భూములు
- వెయ్యిరోజుల పాలనపై సభలో నిలదీయండి
- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు
- మాజీ సీఎం, ప్రతిపక్షనేత దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమం చేసింది.. త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తెచ్చుకున్నది సాగు, తాగునీళ్ల కోసమేనని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో తొంభై శాతం పూర్తయిన పాలమూరు---–రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు. కృష్ణా జలాల కోసం కార్యాచరణ ప్రకటిస్తానని, అవసరమైతే పాదయాత్ర చేస్తానని కేసీఆర్ చెప్పారు. త్వరలోనే పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించి దీనిపై ప్రకటన చేస్తానన్నారు.
అసెంబ్లీ సమావేశాలకు రావాలంటున్నారని, అయితే.. తన చావును పదే పదే కోరుకునే వ్యక్తితో చర్చకు ఎలా వస్తానని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మళ్లీ రాదని వాళ్లకు అర్థమైందని, అందుకే తన చావును కోరుకుంటూ బూతులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సాగునీటి విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జలయుద్ధానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు.
సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ఎల్పీ సమావేశాన్ని కేసీఆర్ నిర్వహించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. సభలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని, ఆయన తీరును ఎండగట్టాలని చెప్పారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో నీళ్లున్నా పంటలకు విడుదల చేయకపోవడం దారుణమన్నారు.
అసెంబ్లీని ప్రజా సమస్యలపై చర్చకు కాకుండా.. బూతు కూతలకు వేదికగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులను తిడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాన్ని తిప్పి కొట్టాలన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్ జలాలను తెలంగాణ రైతాంగానికి అందకుండా పక్క రాష్ట్రం ఉపయోగించుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తున్నదని ఆరోపించారు. మేడిగడ్డ దగ్గర చిన్న రిపేర్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టులను వినియోగంలోకి తెస్తే దాదాపు 13 జిల్లాల్లో రైతులకు సాగునీరు అందుతుందన్నారు.
ఆ ప్రయత్నం ఎందుకు చేస్తలేరో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై అధికార కాంగ్రెస్ చేసినవన్నీ దుష్ప్రచారాలని, కుట్రపూరితంగానే నీటిని ఎత్తిపోయడం లేదన్నది ఎన్‌డీఎస్ఏ ప్రకటనతో స్పష్టమైందని చెప్పారు.
వెయ్యిరోజులైనా హామీల అమలేదీ..?
వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు, హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులైనా అమలు చేయలేదని, దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. గ్రామాలు, పట్టణాల్లోని పట్టా భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడం ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, పిల్లల పెళ్లిళ్లు, దవాఖాన ఖర్చుల వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా తమ భూమిని అమ్ముకోవడానికి వీల్లేక గోసపడుతున్నారని పేర్కొ న్నారు. ఈ సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.
కృష్ణా ప్రాజెక్టుల్లో నీళ్లున్నా సాగుకు ఎందుకు విడుదల చేయట్లేదనే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉన్నా మిషన్ భగీరథ వంటి తాగునీటి వ్యవస్థను నాశనం చేశారని, దీనిపై ప్రభుత్వం సిగ్గుపడాలన్నా రు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు.
పాలిటెక్నిక్‌ను భ్రష్టు పట్టించేలా జీవో 97ను తీసుకొచ్చిన ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ మోసపు హామీలను యువత ప్రశ్నిస్తున్నారని, వారికి మద్దతుగా ఉభయ సభల్లో సభ్యులు గళం విప్పాలన్నారు. ఫార్మా సిటీని రద్దు చేసిన ప్రభుత్వం.. పేదల భూములను రియల్ ఎస్టేట్ దందా కోసం ఉపయోగించుకునే విధంగా ఫ్యూచర్ సిటీ పేరుతో అవినీతికి తెరలేపిందని ఆరోపించారు.
మెట్రోను చేతుల్లోకి తీసుకున్నరు
ప్రభుత్వ భూములను భవిష్యత్ తరాల అవసరాలకు ఉంచకుండా ఇష్టారీతిన అమ్మేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. సజావుగా నడుస్తున్న మెట్రో రైలు నిర్వహణను అనాలోచిత విధానాలతో ప్రభుత్వం తన చేతిలోకి తీసుకున్నదని, తద్వారా ఖజానాపై భారాన్ని మోపిందని మండిపడ్డారు. గోదావరి, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టు పేరుతో రాష్ట్రానికి నష్టం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ బడులను తగ్గించే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని అన్నారు. అడ్డగోలుగా వస్తున్న కరెంట్ బిల్లులు చెల్లించలేక పేదలు, మధ్యతరగతి ఇప్పటికే బాధలు పడుతున్నారని.. రైతు డిస్కం ఏర్పాటుతో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఎత్తేసే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను పెండింగ్‌లో పెట్టడం సిగ్గుచేటన్నారు.
