30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారు : కేటీఆర్

30 నెలల్లో రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టారు : కేటీఆర్
  • ఆశీర్వాద సభలంటూ రేవంత్​ డ్రామాలాడుతున్నడు: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల పాలనలో రైతులకు ఇవ్వాల్సిన రూ.30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆశీర్వాద సభల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలాడుతున్నారని మంగళవారం ఎక్స్‌‌లో చేసిన పోస్టులో విమర్శించారు. రైతుభరోసా డబ్బులు ఖాతాల్లో వేయడానికి ఒక్క బటన్ నొక్కితే సరిపోతుందని, దానికోసం కూడా బహిరంగ సభలు పెట్టడం పీఆర్ స్టంట్ మాత్రమేనని అన్నారు.

ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి, మోసం చేసినందుకు రైతులు శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. మాయమాటలు చెప్పి ఉన్నది ఊడగొట్టాలని చూస్తున్న రేవంత్ ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. రూ.50 వేల కోట్లతో చేయాల్సిన రూ.2 లక్షల రుణమాఫీని చారాణ వంతు కూడా అమలు చేయకుండా రైతుల గొంతు కోశారని ఆరోపించారు.

రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి సభలు పెడుతున్నారని ఆరోపించారు. పంట కొనుగోళ్ల విషయంలో కూడా కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తప్పించుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. రేవంత్​ చేతగానితనాన్ని చూసి అన్నదాతలు పట్టరాని కోపంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు.