- రోడ్లపై కాలిబూడిదవుతున్న ధాన్యం కుప్పలు అసమర్థ పాలనకు నిదర్శనం
- సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో తొమ్మిదిన్నరేండ్లు ధైర్యంతో బతికిన అన్నదాత ప్రస్తుతం ఆత్మవిశ్వాసం కోల్పోయి రోడ్డున పడ్డాడని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతుల నోట్లో మట్టి కొట్టిందని విమర్శించారు. పంటల కొనుగోళ్లపై గురువారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. పంట అమ్ముకుందామనే ఆశతో వచ్చిన రైతులు రోజుల తరబడి పడిగాపులు పడలేక కొనుగోలు కేంద్రాల్లోనే గుండెపగిలి కుప్పకూలుతున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదన్నారు. 70 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో ఉన్న శ్రద్ధలో ఒక్క శాతం రైతులపై ఉన్నా ఈ దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు.
ఢిల్లీకి మూటలు మోయడం తప్ప రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనాలన్న సోయి లేకుండా పోయిందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పది మంది రైతులు వడదెబ్బకుతోడు సర్కారు చేసిన ద్రోహానికి నిండు ప్రాణాలు కోల్పోయారన్నారు. శనివారం నిర్వహించే కేబినెట్ మీటింగ్లోనైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు.
పంట కొనక తగలబెట్టుకుంటున్నరు
ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడంతో మరో మార్గం కనిపించక తమ చేతులతోనే తగలబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణలోని రోడ్లపై కాలిబూడిదవుతున్న ధాన్యం కుప్పలు కాంగ్రెస్ పాలన అసమర్థతకు ప్రత్యక్ష సాక్ష్యాలన్నారు.
రోడ్లపై జరుగుతున్న నిరసనలనుంచి తప్పించుకునేందుకు మంత్రులు హెలికాప్టర్లలో షికార్లు కొడుతున్నారని విమర్శించారు. చివరికి మీ సొంత నియోజకవర్గం కొడంగల్ లో కూడా రైతులు రోడ్డెక్కి దుమ్మెత్తి పోసే దుస్థితి వచ్చిందంటే సాగు ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
