కేటీఆర్ దత్తత తీసుకున్నా దశ మారలే!

కేటీఆర్ దత్తత తీసుకున్నా దశ మారలే!

    అమలు కాని మంత్రి హామీలు

    రోడ్లపైనే మురుగు పరుగు

    జీ+2 అనుమతులు తీసుకొని    ఐదంతస్తుల్లో నిర్మాణాలు

   చెంతనే రిజర్వాయర్ ఉన్నా  తాగునీటికి ఇబ్బందులు

 

‘‘హైదర్​నగర్ డివిజన్​ను దత్తత తీసుకుంటున్నా.. జానకి రామరాజును గెలిపించండి.. గ్రేటర్లోనే మోడల్​ డివిజన్​గా తీర్చిదిద్దుతా..’’ ఇవీ గత గ్రేటర్ ఎన్నికల్లో  మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్న మాటలు. కానీ దత్తత తీసుకున్నా దమ్మిడి కూడా ఎక్కువ ఇవ్వలేదు. అన్ని డివిజన్లకు ఇచ్చినట్టే నిధులు మంజూరు చేశారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులు పట్టించు కోకపోవడంతో అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా తయారైంది.

మున్సిపల్​శాఖా మంత్రి కేటీఆర్ స్వయంగా దత్తత తీసుకున్నా హైదర్​నగర్​డివిజన్ దశ మారలేదు. కూకట్​పల్లి సర్కిల్​లోనే అతిపెద్ద డివిజన్ హైదర్​నగర్. జలవాయు విహార్, బృందావన్​ కాలనీ, అడ్డగుట్ట సొసైటీ, సెవెన్​ హిల్స్ కాలనీ సంపన్నులుండే కాలనీలు. శ్రీరాంనగర్, ఇందిరానగర్, హైదర్ నగర్​ ఓల్డ్​ విలేజ్, రాంనరేష్ నగర్, నందమూరి నగర్​లలో  పేద, మధ్య తరగతికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు.

డ్రైనేజీ అస్తవ్యస్తం

హైదర్​నగర్ డివిజన్లో ప్రధాన సమస్య డ్రైనేజీ. కోట్లు కుమ్మరించినా డ్రైనేజీ వ్యవస్థ మాత్రం మారడం లేదు. నిత్యం అడ్డగుట్ట, వెస్ట్రన్​ హిల్స్, హెచ్ఎంటీ హిల్స్​కాలనీల్లో డ్రైనేజీ పొంగి పొర్లుతోంది. దీనికి ప్రధాన కారణం అడ్డగుట్ట సొసైటీలో వర్కింగ్ మెన్స్, విమెన్స్ హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలియడమే. దీంతోపాటు 200 గజాల్లో కూడా 5 ఫ్లోర్ల అపార్ట్​మెంట్స్ కట్టడం మరో కారణం. దాదాపు రూ.కోట్లు వెచ్చించి అండర్​గ్రౌండ్​ డ్రైనేజీలను నిర్మించారు. చిన్న పైపులైన్లు వేయడంతో పెరిగిన జనాభాకు అవి సరిపడక మురుగు రోడ్ల పైనే పారుతోంది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్

ఈ డివిజన్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్​గా మారింది. అడ్డగుట్ట, వెస్టిన్ హిల్స్, బృందావన్ కాలనీల్లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని ఐదు అంతస్తుల వరకు నిర్మించి సొమ్ము చేసుకుంటున్నారు. పక్క పక్కనే ఉన్న 100, 200 గజాల్లో విడివిడిగా జీ+2 అనుమతులు తీసుకొని రెండింటినీ కలిపి ఐదు అంతస్తులు నిర్మిస్తూ అమాయకులకు అంటగట్టి రూ.కోట్లు ఆర్జిస్తున్నారు. స్వయంగా మున్సిపల్​ మంత్రి కేటీఆర్​ దత్తత తీసుకున్న డివిజన్​లోనే అక్రమ నిర్మాణాలు వెలుస్తుంటే మిగిలిన డివిజన్ల పరిస్థితి ఏంటని స్థానిక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

హైదర్ నగర్​లో సీమాంధ్ర వాసులు ఎక్కువగా ఉంటారు. గత జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో  ఆ ప్రాంతానికి చెందిన జానకి రామరాజుకే కార్పొరేటర్​స్థానానికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. కేటీఆర్ ఇక్కడకు వచ్చి ప్రచారం నిర్వహించారు. భారీ మెజార్టీతో జానకి రామరాజు గెలుపొందారు. కానీ కార్పొరేటర్ గా గెలిచిన తర్వాత జానకి రామరాజు ఏ మాత్రం డివిజన్ ను పట్టించుకోవడం లేదని, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించి వారి వద్ద నుంచి రూ. కోట్లు వసూలు చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

 

వారానికోసారి మంచి నీళ్లొస్తయ్

మరో ప్రధాన సమస్య తాగునీటి సమస్య. భాగ్యనగర్ కాలనీలో అతిపెద్ద గోదావరి మంచినీటి సంపు ఉన్నా కాలనీవాసులకు సరిపడా మంచినీళ్లు రావడం లేదు. జలమండలి అధికారుల వైఫల్యమేనని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.  వారం, పది రోజులకోసారి నీళ్లు ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే అంబీర్ చెరువు నాలా హైదర్ నగర్ డివిజన్ మధ్య నుంచి వెళుతుంది. చెరువు నాలాలో మురుగు ప్రవహిస్తుండటంతో దుర్వాసన వస్తోంది. దీంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. నాలాలో ఎస్టీపీ నిర్మించి మురికి నీటిని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

డివిజన్ : హైదర్ నగర్

క్రమసంఖ్య : 124

అసెంబ్లీ సెగ్మెంట్​: శేరిలింగంపల్లి

జనాభా : 50,000

ప్రముఖ కాలనీలు : అడ్డగుట్ట, వెస్టర్న్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, హైదర్ నగర్, సెవెన్ హిల్స్ కాలనీ, బృందావన్ కాలనీ, హెచ్ఎంటీ  హిల్స్, శాతవాహన, జలవాయు విహార్, సాయిప్రశాంత్ నగర్, జయభారత్ నగర్, నందమూరి నగర్, ఆదిత్యా నగర్,  శ్రీరాంనగర్​కాలనీ

విశేష ప్రాంతాలు : హెచ్ఎంటీ కాలనీలోని శివాలయం, ఎల్లమ్మ చెరువు, శాతవాహన నగర్, జలవాయు విహార్​ కాలనీల్లోని
పార్క్​లు

ప్రధాన సమస్యలు : భూగర్భ డ్రైనేజీ అస్తవ్యస్తం, తాగునీటి సమస్య, అక్రమ నిర్మాణాలు.

 

 ఇండ్లలో ఉండలేకపోతున్నం..
నిత్యం రోడ్లపై పారుతున్న మురుగులోంచి నడవలేక పోతున్నాం. దుర్వాసనతో ఇండ్లలోఉండలేకపోతున్నాం. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడం లేదు. కాలనీలో హాస్టళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఉదయం ఐదు గంటల నుంచే డ్రైనేజీలు జామ్ అయి రోడ్లపై మురుగు కాలువలా పారుతోంది.
– సింహాచలం, అడ్డగుట్ట