- రేవంత్ ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్త: కేటీఆర్
- రూ.లక్ష కోట్లలో మిగిలిన రూ.99 వేల కోట్లతో హామీలు అమలు చెయ్
- కాళేశ్వరం మాదిరిగానే కేసీఆర్ ఆస్తులపైనా విషం చిమ్ముతున్రు
- ఎన్ని కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. నువ్వేమీ చేయలేవ్
- హైదరాబాద్‌కు పేరు తెచ్చే ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే కేసులు పెట్టారు
- నాంపల్లి కోర్టు వద్ద మీడియాతో మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: వెయ్యి కోట్లు ఇస్తే తన ఆస్తులన్నీ ఇచ్చేస్తానని.. సీఎం రేవంత్ ఎక్కడ సంతకం పెట్టుమంటే అక్కడ పెడ్తానని బీఆర్ఎస్ వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్అన్నారు. ‘కేసీఆర్ కుటుంబం 400 ఎకరాల భూములతో రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.. రేవంత్‌కు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఆయన అంటున్న రూ.లక్ష కోట్లలో రూ.వెయ్యి కోట్లు తనకు ఇస్తే ఆ భూములు మొత్తం రాసిచ్చేస్తా. రేవంత్ ఎక్కడ సంతకం పెట్టుమన్నా పెడతా.. ’ అని సవాల్ విసిరారు. రూ.వెయ్యి కోట్లు ఇచ్చాక.. లక్ష కోట్లలో మిగిలిన రూ.99 వేల కోట్లతో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా, మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, ఫీజు రీయింబర్స్మెంట్, దళితబంధు, గిరిజనబంధు పథకాలను అమలు చేసి చూపించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌ను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే లక్ష్యానికి బదులు కేవలం ప్రతిపక్షాలనే టార్గెట్ చేసుకున్నదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో శుక్రవారం నాంపల్లి కోర్టు వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
అప్పట్లో ఎకరం రూ.5లక్షలే..
కాళేశ్వరం ప్రాజెక్టు రూ.లక్ష కోట్లంటూ విష ప్రచారం చేశారని, ఇప్పుడు తమ భూముల విషయంలో అదే స్థాయిలో కేసీఆర్‌పై విషం చిమ్ముతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలోని ఎర్రవల్లిలో 20 ఏండ్ల క్రితం కేసీఆర్ భూములు కొన్నారని, అప్పుడు ఎకరం రూ.5 లక్షలే ఉందని గుర్తు చేశారు. పదివేల ఎకరాలు కేసీఆర్ కబ్జా చేశారంటూ ఎన్నోసార్లు రేవంత్ ఆరోపించారని, వెయ్యి ఎకరాల ఫాంహౌస్ అంటూ మాట్లాడారని మండిపడ్డారు. కానీ, అసెంబ్లీలో 67 ఎకరాలేనని రేవంతే స్వయంగా చెప్పారని పేర్కొన్నారని.. మరి, మిగతా 933 ఎకరాలు ఎటు పోయాయని రేవంత్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. ముందు కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
22ఏ నుంచి దృష్టి మళ్లించేందుకే..
పేదల భూములను 22ఏలో పెట్టి 30 శాతం కమీషన్లు దండుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రేవంత్ ఈ భూముల డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ‘‘ఎన్ని కేసులు పెట్టుకుంటవో పెట్టుకో.. ఎన్ని కమిషన్లు వేస్తవో వేసుకో.. ఏం చేసుకుంటవో చేసుకో.. నువ్వు ఏమీ చేయలేవు అని ప్రజలకు అర్థమైంది. పోలీసులు వేధిస్తున్నా.. పోలీసుస్టేషన్లోనే మాపై దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలే.. న్యాయస్థానాలు అండగా నిలిచినయ్.. హైదరాబాద్‌కు పేరు తెచ్చే ఫార్ములా ఈ రేస్‌ను తీసుకొచ్చాం. కానీ, ఆ రేసులో ఏదో జరిగిపోయిందని ఆరోపిస్తూ నాపై కేసు పెట్టారు. అయినా సరే ఎదుర్కొంటం. ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్ నిర్వహించినం. తమిళనాడు సీఎం విజయ్ ఇటీవల మోటార్ స్పోర్ట్ రేసింగ్ కోసం లండన్ పోయిండు.. పెట్టుబడులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నరు.. అదే ప్రయత్నం మేం చేసినం. కానీ, మా మీద కేసులు పెట్టి వేధిస్తున్నరు. కోర్టుకు ఇప్పటికే రెండు సార్లు వచ్చిన. ఎన్నిసార్లు పిలిచినా వస్తా. విచారణకు సహకరిస్తా’’ అని కేటీఆర్ చెప్పారు.
రాహుల్.. ఇదేనా మీ ప్రేమ దుకాణం?
రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ పదే పదే వేదాలు వల్లిస్తుంటారని, మాట్లాడే స్వేచ్ఛ గురించి చెబుతుంటారని కేటీఆర్అన్నారు. ప్రేమ దుకాణమంటూ రాహుల్ రాజకీయాల గురించి చెప్తే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. పోలీసులు తమ పార్టీ నేత క్రిశాంక్ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ప్రవేశించారని, ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో విమర్శించినందుకు అరెస్ట్ చేశారని విమర్శించారు. సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా అరెస్టులు చేయొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా.. రేవంత్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని నిలదీశారు. దీనికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు. కాగా, దానం నాగేందర్ అనర్హత వేటుపైనా ఆయన స్పందించారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుందన్నారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
