కాంగ్రెస్‌‌ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను ఎత్తేస్తరు : కేటీఆర్

కాంగ్రెస్‌‌ కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను ఎత్తేస్తరు : కేటీఆర్
  •     బీజేపీ మత రాజకీయాలు చేస్తున్నది: కేటీఆర్  
  •     ఆ రెండు పార్టీలను నమ్మొద్దన్న బీఆర్ఎస్ నేత

రాజన్న సిరిసిల్ల, వెలుగు: కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను ఎత్తేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్‌‌కు ఓటేస్తే సిరిసిల్ల జిల్లాను ఎత్తేస్తారని అన్నారు.  గురువారం సిరిసిల్లలో కేటీఆర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలను నమ్మి జనం కాంగ్రెస్‌‌కు ఓటేస్తే, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. 

‘‘మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం రేవంత్ చెప్తున్నారు. ఇప్పుడే వేయడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి? ఎన్నికల్లో ఆశపెట్టి మరోసారి మోసం చేయడానికే రేవంత్ ఈ మాట చెబుతున్నారు” అని ఫైర్ అయ్యారు. రేవంత్‌‌కు కేసీఆర్‌‌‌‌ను తిట్టుడు తప్ప ఇంకో పని లేదన్నారు. 

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పినట్టు రేవంత్ వింటున్నారని విమర్శించారు. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లను రద్దు చేసిన కాంగ్రెస్‌‌కు బతుకులేకుండా చేయాలన్నారు. ‘‘గుడి ముందు అడుక్కునే బిచ్చపోళ్ల లాగా ప్రజలను మతం పేరిట బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు. మతం పేరిట రాజకీయాలు చేయడం తప్ప.. బీజేపోళ్లకు ఏం తెల్వదు. వాళ్లను నమ్మొద్దు.. గత 12 ఏండ్లలో రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా  తేలేదు. మతం, కులం చూసి ఓటు వేయవద్దు. నీతి నిజాయతీతో పనిచేసే వాళ్లకే ఓటు వేయండి” అని కోరారు.