హైదరాబాద్, వెలుగు: జీవితంలో ఇక తాము అధికారంలోకి రాలేమన్న అసహనంతో ఉన్న కేటీఆర్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్ అయ్యారు. గురువారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. చేవెళ్లలో కేటీఆర్ చేసిన విమర్శలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌ను ఆర్థికంగా విధ్వంసం చేయాలన్న ఆలోచన కేటీఆర్‌లో కనిపిస్తుందని సత్యం ఆరోపించారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం శ్రమిస్తే.. కేటీఆర్ మాత్రం హైదరాబాద్‌ను చులకన చేసి మాట్లాడుతున్నాడని విమర్శించారు.
రియల్ ఎస్టేట్ పడిపోయిందని కేటీఆర్ భావిస్తే.. గచ్చిబౌలిలోని ఆయన విల్లాను బేరం పెట్టాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కొన్న దానికన్నా 50 శాతం ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు తాము సిద్ధమన్నారు. కేటీఆర్ మా సీఎంను రజనీకాంత్‌తో డిప్యూటీ సీఎం భట్టిని కమలాసన్‌తో పోల్చినందుకు సంతోషమని, మా సీఎం ఎప్పుడూ హీరోనే అని మీరే ఇక్కడి ప్రజల్లో విలన్లని ఎద్దేవా చేశారు.
