చార్మినార్, వెలుగు: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈదీ బజార్ వద్ద ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రూ.17 లక్షలు చోరీకి గురైన కేసును పోలీసులు 28 గంటల్లో ఛేదించారు. పురానీహవేలీలోని డీసీపీ కార్యాలయంలో చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్ గురువారం వివరాలు వెల్లడించారు.
జగిత్యాల జిల్లా గొర్రెగుండానికి చెందిన, ప్రస్తుతం బాలానగర్ ఫిరోజ్‌గూడలో నివసిస్తున్న చిర్ర శ్రీనివాస్ అలియాస్ శ్రీను(42), అతని కొడుకులు చిర్ర అనీష్ అలియాస్ జాన్(22), చిర్ర జస్వంత్(20)ను పోలీసులు అరెస్ట్ చేశారు.
దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాస్ ప్రమాదానికి గురై హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. క్లియర్డ్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 6 నెలలుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 23న ఈదీ బజార్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్లో లోడ్ చేయాల్సిన రూ.17 లక్షల నగదు సంచితో పరారయ్యాడు. అతడికి కొడుకులు అనీష్, జస్వంత్ సహకరించారు.
గురువారం బోయిన్‌పల్లిలో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.14 లక్షల 55 వేలు స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన టాస్క్ ఫోర్స్, ఐఎస్ సదన్ పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు.
