72nd National Film Awards 2026: భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకను మంగళవారం (సెప్టెంబర్ 22) గుజరాత్‌లోని ఏక్తా నగర్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వేదికగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వివిధ విభాగాల్లో ఎంపికైన విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఢిల్లీ వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారి కావడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సత్తా చాటిన టాలీవుడ్.. 9 జాతీయ అవార్డులు
ఇక ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై తెలుగు సినిమా సత్తా మరోసారి ఘనంగా చాటుకుంది. ‘కల్కి 2898 ఏడీ’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘35.. చిన్న కథ కాదు’, ‘పుష్ప-2’, ‘లక్కీ భాస్కర్’ సహా పలు తెలుగు చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. మొత్తంగా తెలుగు సినిమాలకు 9 జాతీయ అవార్డులు దక్కడంతో టాలీవుడ్ ప్రతిభకు జాతీయ స్థాయిలో మరోసారి ఘన గుర్తింపు లభించింది.
యామీ గౌతమ్‌కు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు..
‘ఆర్టికల్ 370’ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన యామీ గౌతమ్‌కు (Yami Gautam) బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. అంతేకాదు, ఇదే సినిమాకు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా రావడంతో ‘ఆర్టికల్ 370’ టీమ్‌కు డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. అవార్డు అందుకున్న అనంతరం యామీ.. నేషనల్ అవార్డు అనేది ఒక ఆర్టిస్టుకు దేశం నుంచి లభించే అత్యున్నత గుర్తింపుల్లో ఒకటని, ఈ క్షణాన్ని ఇంకా పూర్తిగా ఆస్వాదిస్తున్నానని పేర్కొన్నారు.
మమ్ముట్టి, కార్తిక్ ఆర్యన్.. బెస్ట్ యాక్టర్ అవార్డు
బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఈసారి ఇద్దరు విజేతలుగా నిలిచారు. ‘బ్రహ్మయుగం’లో నటనకు మమ్ముట్టి (Mammootty), ‘చందు ఛాంపియన్’లో నటనకు కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) సంయుక్తంగా బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నారు. మమ్ముట్టికి ఇది నాలుగో నేషనల్ అవార్డు కావడం మరో ప్రత్యేకత. దీంతో బెస్ట్ యాక్టర్ విభాగంలో అత్యధిక నేషనల్ అవార్డులు అందుకున్న నటులలో ఆయన స్థానం మరింత ప్రత్యేకంగా నిలిచింది.
‘అమరన్’ దర్శకుడికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు..
శివకార్తికేయన్, సాయి పల్లవి నటించిన ‘అమరన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజ్‌కుమార్ పెరియసామికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు లభించింది. అదే సినిమాకు బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్ (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్) విభాగాల్లోనూ అవార్డులు దక్కాయి.
ధనుష్‌కు డబుల్ రికగ్నిషన్..
తమిళ స్టార్ ధనుష్ (Dhanush)కు ఈసారి రెండు గుర్తింపులు లభించాయి. ఆయన దర్శకత్వం వహించి నటించిన ‘రాయన్’కు బెస్ట్ తమిళ్ ఫిల్మ్ అవార్డు దక్కగా.. ‘కెప్టెన్ మిల్లర్’లో నటనకు స్పెషల్ మెన్షన్ లభించింది. ‘కెప్టెన్ మిల్లర్’కు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ప్రమోటింగ్ నేషనల్, సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ వాల్యూస్ అవార్డు కూడా దక్కింది.
‘కల్కి 2898 AD’కి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం..
ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’కు బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డు దక్కింది. ఇదే సినిమాకు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డు కూడా లభించింది. దీంతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌కు నేషనల్ అవార్డ్స్ వేదికపై రెండు కీలక గుర్తింపులు దక్కాయి.
‘పుష్ప 2’, ‘స్త్రీ 2’, ‘భూల్ భులయ్యా 3’ హవా..
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప: ది రూల్ పార్ట్-2’కు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో అవార్డులు దక్కాయి. ‘స్త్రీ 2’కు బెస్ట్ కొరియోగ్రఫీ అవార్డు లభించగా.. ‘భూల్ భులయ్యా 3’ బెస్ట్ సౌండ్ డిజైన్ అవార్డును అందుకుంది.
తెలుగు సినిమాలకు ఘన గుర్తింపు..
తెలుగు సినిమా నుంచి ‘కమిటీ కుర్రోళ్లు’ బెస్ట్ తెలుగు ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది. అదే సినిమాకు బెస్ట్ మేకప్ అవార్డు కూడా దక్కింది. ‘35-చిన్న కథ కాదు’ బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఆ సినిమాకు చెందిన అరుందేవ్ పొతుల బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును కూడా అందుకున్నారు. ‘లక్కీ భాస్కర్’కు డైలాగ్ రైటర్ విభాగంలో అవార్డు దక్కింది.
అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు..
కన్నడ సినీ దిగ్గజం అనంత్ నాగ్‌కు (Anant Nag)క 2024 సంవత్సరానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో 300కు పైగా సినిమాల్లో నటించిన అనంత్ నాగ్‌కు భారతీయ సినిమాకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ అత్యున్నత గౌరవం లభించింది.
నేషనల్ అవార్డ్స్ ఫుల్ లిస్ట్:
- ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370
- ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి – అమరన్
- ఉత్తమ నటుడు: మమ్ముట్టి – భ్రమయుగం
- ఉత్తమ నటుడు: కార్తిక్ ఆర్యన్ – చందూ ఛాంపియన్
- ఉత్తమ నటి: యామీ గౌతమ్ – ఆర్టికల్ 370
- ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ మిశ్రా – భక్షక్
- ఉత్తమ సహాయ నటి: సచన నామిదాస్ – మహారాజా
- ఉత్తమ సహాయ నటి: రూపశ్రీ వర్కాడే – మిథ్య
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: రణ్‌దీప్ హుడా – స్వాతంత్ర్య వీర్ సావర్కర్
- ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: కల్కి 2898 ఏడీ
- ఉత్తమ జాతీయ, సామాజిక, పర్యావరణ విలువలను ప్రోత్సహించే చిత్రం: కెప్టెన్ మిల్లర్
- ఉత్తమ బాలల చిత్రం: 35 – చిన్న కథ కాదు
- ఉత్తమ బాల నటుడు/నటులు: రిద్ధిమాన్ బెనర్జీ, తపోమయ్ దేబ్, గీతాశ్రీ చక్రవర్తి, అరుదేవ్ పోతుల, అతిష్ ఎస్. శెట్టి
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: షెహనాద్ జలాల్ – భ్రమయుగం
- ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: సుకుమార్ – పుష్ప: ది రూల్ పార్ట్-2
- ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: యోగేశ్ దేశ్‌పాండే – స్వర్గంధర్వ సుధీర్ ఫడ్కే
- ఉత్తమ సంభాషణలు: వెంకీ అట్లూరి – లక్కీ భాస్కర్
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ చౌదరి – కల్కి 2898 ఏడీ
- ఉత్తమ యాక్షన్ డైరెక్షన్: అనల్ అరసు – మహారాజా
- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: పి. రవి కుమార్ – కమిటీ కుర్రోళ్లు
- ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: దీపాలి నూర్, శీతల్ శర్మ – పుష్ప: ది రూల్ పార్ట్-2
- ఉత్తమ సంగీత దర్శకత్వం: శాశ్వత్ సచ్దేవ్ – ఆర్టికల్ 370
- ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: జి.వి. ప్రకాశ్ కుమార్ – అమరన్
- ఉత్తమ గీత రచయిత: మనోజ్ ముంతషీర్ – మైదాన్
- ఉత్తమ పురుష నేపథ్య గాయకుడు: అభయ్ జోధ్‌పుర్కర్ – ఘరత్ గణపతి
- ఉత్తమ మహిళా నేపథ్య గాయని: వైకోమ్ విజయలక్ష్మి – ARM
- ఉత్తమ కొరియోగ్రఫీ: విజయ్ గంగూలీ – స్త్రీ 2
- ఉత్తమ సౌండ్ డిజైన్: మనస్ చౌదరి – భూల్ భులయ్యా 3
- ఉత్తమ ఎడిటింగ్: ఆర్. కళైవాణన్ – అమరన్
