గచ్చిబౌలి, వెలుగు: వీసా గడువు పొడిగిస్తామంటూ ఓ మహిళ నుంచి రూ.9.60 లక్షలు వసూలు చేసి మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద మోసపోయిన మొత్తం నగదును రికవరీ చేశారు. సైబర్ క్రైమ్ ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గండిపేట ప్రాంతానికి చెందిన ఓ యువతి లండన్‌లో చదువుకుంటోంది.
ఆమె వీసా గడువు ముగియబోతుందని తెలుసుకున్న గుంటూరుకు చెందిన అర్జున్ రెడ్డి(38), తనకు పరిచయాలు ఉన్నాయని చెప్పి వీసా గడువును మరో మూడేళ్లు పొడిగిస్తానని నమ్మించాడు. అతని మాటలు నమ్మిన యువతి, తన తల్లి ఖాతా నుంచి పలు విడతల్లో రూ.9.60 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది.
వీసా ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో మోసపోయానని యువతి గుర్తించింది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. అర్జున్ రెడ్డితో పాటు అతడు డబ్బు పంపించిన ఏపీలోని పల్నాడు జిల్లా నర్సరావుపేటకు చెందిన అంజయ్యరెడ్డి(45)ని పోలీసులు అరెస్ట్ చేశారు. యువతి చెల్లించిన రూ.9.60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
