తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ సూపర్ :మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా

తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ సూపర్ :మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా
  • మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ప్రశంసలు 

హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్‌‌‌‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) తరహాలోనే తమ రాష్ట్రంలోనూ అత్యాధునిక ‘టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్’ ఏర్పాటు చేస్తామని మేఘాలయ సీఎం  కాన్రాడ్ కె సంగ్మా అన్నారు. ప్రజా భద్రత, సుపరిపాలన కోసం తెలంగాణ ప్రభుత్వం అధునాతన టెక్నాలజీని వినియోగిస్తోందని అభినందించారు.

టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, భారీ వీడియో వాల్ పనితీరు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని కొనియాడారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం హైదరాబాద్‌‌‌‌కు వచ్చిన మేఘాలయ సీఎం..  పరిశ్రమల శాఖ కమిషనర్,సెక్రటరీ సిరిల్ వి. డార్లాంగ్ డియంగ్డో,  సచివాలయ జాయింట్ సెక్రటరీ శివాంశ్ అవస్థితో కలిసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు.

వీరికి కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌‌‌ ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్, వీడియో వాల్, అత్యవసర సేవల సమన్వయ వ్యవస్థ (రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ - డయల్ 112), విపత్తు నిర్వహణ సమయాల్లో ఐసీసీసీ ఎలా పనిచేస్తుందో అనే వివరాలను  అధికారులు లైవ్ డెమో ద్వారా వివరించారు. ఈ  సందర్భంగా మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా అధికారులతో మాట్లాడారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును మరింత లోతుగా అధ్యయనం చేస్తామన్నారు.  త్వరలోనే మేఘాలయ నుంచి ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపిస్తామని తెలిపారు. అధ్యయనం ఆధారంగా తమ రాష్ట్రంలోనూ ఐసీసీసీ తరహాలోనే ‘టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్’ స్థాపించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని సీఎం కాన్రాడ్ కె సంగ్మా  పేర్కొన్నారు.