విభేదాలుంటే రచ్చకెక్కొద్దు : కేడర్ కు KTR సూచన

విభేదాలుంటే రచ్చకెక్కొద్దు : కేడర్ కు KTR సూచన

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమం

కోడ్ ఉండటంతో సింపుల్ గా నిర్వహణ

ఎన్నికల తర్వాత ఆడంబరంగా వేడుకలు 

కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన కేటీఆర్

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 18వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు… తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి..పార్టీ జెండా ఎగురవేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఈ ప్రోగ్రామ్ కు అటెండయ్యారు. చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు తుమ్మల నాగేశ్వర్ రావు, స్వామి గౌడ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చారు. .

ఆవిర్భావ సభలో కేటీఆర్ మాట్లాడారు. “కేసీఆర్ వెంట ఇన్నేళ్లు నడిచిన, నడుస్తున్న గులాబీ సైనికులకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఎంచుకున్న లక్ష్యంలో భాగంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రెండు సార్లు సీఎం అయిన ఘనత కేసీఆర్ కే సొంతమైంది. తెలుగు ప్రజల కోసం పార్టీలు పెట్టి విజయం సాధించిన నాయకులు ఎన్టీఆర్, కేసీఆర్ ఇద్దరు మాత్రమే. కేసీఆర్ ఏనాడూ పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు. ఓ దుస్సాహసంతో టీఆర్ఎస్ ను స్థాపించారు. అనేక ప్రతికూలతల మధ్య మొక్కవోని దైర్యంతో ముందుకు సాగారు. తెలంగాణ పోరాటాన్ని వదిలితె రాళ్ళతో కొట్టి చంపండని పార్టీ ఆవిర్భావం నాడే దైర్యంగా చెప్పిన వ్యక్తి కేసీఆర్. ప్రణబ్ ముఖర్జీ లాంటి వ్యక్తి కేసీఆర్ నిబద్ధతను కీర్తించారు” అని చెప్పారు.

16 ఎంపీ సీట్లు టీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెప్పిన కేటీఆర్.. ఎంపీటీసీ ,జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఎగిరేది గులాబీ జెండానే అన్నారు.కేసీఆర్ లాంటి నాయకుడు తమకు ఎందుకు లేరని వేరే రాష్ట్రాల వారు భావించే పరిస్థితి ప్రస్తుతం ఉందన్నారు. పార్టీలో కార్యకర్తల సంఖ్య ఎక్కువైనందున అందరూ సంయమనంతో ముందుకు సాగాలనీ.. విబేధాలు నాలుగు గోడల మధ్యే ఉండాలి….రచ్చకెక్కొద్దు అని సూచించారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరించే చాణక్య నీతి కేసీఆర్ దగ్గర ఉందని చెప్పారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఆవిర్భావ వేడుకలు ఆడంబరంగా నిర్వహించుకుందామని చెప్పారు కేటీఆర్.