నల్లబెల్లి, వెలుగు : అధికారం ఉన్నా, లేకున్నా పేదల పక్షాన పోరాటం చేసేది కమ్యూనిస్టులేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో శుక్రవారం నిర్వహించిన సీపీఐ రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఎర్ర జెండాను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని కోరారు.
ప్రజలు కట్టే పన్నులతో కాంగ్రెస్, బీజేపీ లీడర్లు అత్యంత ఎత్తుకు ఎదుగుతున్నారన్నారు. కార్మిక, రైతు ఉద్యమాల సమీకరణ సీపీఐకే సాధ్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హేమంతరావు, ఎస్‌కే.బాషుమియా, రమేశ్, లక్ష్మణ్, బద్రి, చెన్నకేశవులు, రవీందర్ పాల్గొన్నారు. అంతకుముందు మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పలువురు నాయకులు కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో సీపీఐలో చేరారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో సీపీఐ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందన్నారు. సీపీఐ లో చేరిన వారిలో గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య హరినాయక్, మేదరమెట్ల గిరిప్రసాద్, మండల మాజీ కార్యదర్శి అన్నం శ్రీనివాస్, భుక్యా పూల్‌సింగ్, ధరావత్ లక్ష్మి తదితరులు ఉన్నారు.
