బుమ్రా మంచి బౌలరే.. నేను అంతకు మించిన వాడిని: దక్షిణాఫ్రికా అండర్-19 బౌలర్

బుమ్రా మంచి బౌలరే.. నేను అంతకు మించిన వాడిని: దక్షిణాఫ్రికా అండర్-19 బౌలర్

ప్రస్తుత ప్రపంచ క్రికెట్ లో స్టార్ బౌలర్ల లిస్టులో బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. మూడు ఫార్మాట్ లలో నిలకడగా రాణించే అతి కొద్ది మంది బౌలర్లలో బుమ్రా ఒకడు. తన పదునైన యార్కర్లు, స్వింగ్, బౌన్స్ తో ఎంతటి స్టార్ బ్యాటర్ నైనా బోల్తా కొట్టిస్తాడు. ప్రపంచ స్టార్ బ్యాటర్లు సైతం ఈ యార్కర్ల వీరుడిని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడతారు. ఇప్పటికే క్రికెట్ లో తనదైన ముద్ర వేసిన బుమ్రా..నెంబర్ వన్ బౌలర్ గా కితాబులందుకుంటున్నాడు. అయితే అందరికీ షాక్ ఇస్తూ బుమ్రా కంటే తానే గొప్ప బౌలర్ అని ఒక 17 ఏళ్ళ కుర్రాడు అన్నాడు. 

అండర్-19 వరల్డ్ కప్ లో భాగంగా వెస్టింసీడ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో పేస్ బౌలర్ క్వేనా మఫాకా 9.1 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ 17 ఏళ్ళ కుర్రాడి ధాటికి విండీస్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. పదునైన పేస్ స్వింగ్ బౌలింగ్ తో బ్యాటర్లను దడదడలాడించాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న క్వేనా.. బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
   
జస్ప్రీత్ బుమ్రా మీరు మంచి బౌలర్.. కానీ నేను మీ కంటే గొప్పవాడిని.. అని తనకు తాను హైలెట్ చేసుకున్నాడు. ఒక 17 ఏళ్ళ కుర్రాడు బుమ్రా గురించి ఈ స్టేట్ మెంట్ ఇచ్చి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచాడు. తనపై తనకు నమ్మకముందో.. లేకపోతే వార్తల్లో నిలవాలని ఇలా చెప్పుకొచ్చాడో తెలియాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విండీస్ 40.1 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది.