న్యూఢిల్లీ: ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ పెద్ద బాంబు పేల్చాడు. తాను క్రికెట్ వదిలేయడానికి ముం బై బాంబు పేలుళ్ల కేసు క్రిమినల్ దావూద్ ఇబ్రహీం బెదిరింపులే అతిపెద్ద కారణమని చెప్పారు. అండర్‌వరల్డ్ డాన్ ‘డీ’ కంపెనీ ఐపీఎల్ ఫ్రాంచైజీని తన చేతిలోకి తీసుకోవాలని కూడా ప్లాన్ చేసిందని వెల్లడించారు. ఇటీవల ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లలిత్ మోడీ పలు సంచలన విషయాలు తెలిపారు. ప్రస్తు తం లండన్‌లో ఉంటున్న లలిత్ మోడీ.. 2010లో ఆర్థిక అవకతవకల ఆరోపణలు రావడంతో భారత్ విడిచి వెళ్లాడు. 2012లో లండన్‌లో జరిగిన ఒక ఘటన తనను నిరంతరం వేధిస్తోందని లలిత్ మోడీ ఇంటర్య్యూలో చెప్పారు.
రాత్రి 3:30 గంటలకు ఒక మధ్యవర్తి ఫోన్ చేసి పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌కు రమ్మని పిలిచాడు. అక్కడికి వెళ్లిన తనకు శాటిలైట్ ఫోన్ ఇచ్చి.. అవతల దావూద్ లైన్లో ఉన్నాడు మాట్లాడు అని చెప్పారు. ఫోన్లో అవతలి వ్యక్తి ‘‘ఇప్పటి నుంచి నీ పని అయిపోయింది’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. “నేను భయంతో అక్కడికక్కడే వణికిపోయాను’’ అని మోడీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో బిల్డింగ్ కింద బ్రిటిష్ ఎంI5 సెక్యూరిటీ ఉందని కూడా తెలిపాడు. ఆ తర్వాత వారానికోసారి ఫోన్ కాల్స్ మొదలయ్యాయని, డబ్బులు కావాలని, ఐపీఎల్ ఫ్రాంచైజీ మీద కంట్రోల్ కల్పించాలని డిమాండ్ చేశారు. తాను అక్రమ సట్టా నెట్‌వర్క్‌లకు అడ్డు నిలబడ్డందుకే మాఫియా తనపై పగబట్టిందని లలిత్ మోడీ ఇంటర్వ్యూలో వివరించారు.
