
భూ సమస్యల శాశ్వత పరిస్కారానికి కొత్తగా భూ భారతి చట్టం తీసుకొచ్చామని రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జూన్ రెండవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా భూముల సర్వేలు ప్రారంభం అవుతాయని, ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలో రెవిన్యూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని తెలిపారు. అందుకోసం 6 వేల మంది సర్వేయార్లను కొత్తగా నియమిస్తున్నట్లు చెప్పారు.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటలో భూ భారతి రెవిన్యూ అవగాహన సదస్సులో ఆయన ప్రసంగించారు. ప్రతి సర్వే నెంబర్ ను తెలిపేలా భూములకు భూదార్ కార్డులు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. భూ సమస్యల పరిష్కారం కోసం అధికారులు గ్రామాల్లోకి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంలో పేద వారిని ఇబ్బంది పెట్టకుండా రెవిన్యూ అధికారులు పని చేయాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ప్రతి నిరుపేదకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3 వేల 5 వందల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి తెలిపారు.
దేశానికే రోల్ మోడల్ ఈ భూ భారతి చట్టం: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం దేశానికే ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూ భారతి రెవిన్యూ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన.. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఆర్ధిక వ్యవస్థ బాగాలేకున్న సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపడం లేదన్నారు. పేదవారిని ఇబ్బంది పెట్టకుండా రెవిన్యూ అధికారులు పని చేయాలని ఆదేశించారు.
ఎన్నికల హామిలో భాగంగా ధరణి స్థానంలో భూభారతీ రెవిన్యూ చట్టం తీసుకొచ్చామని.. రాష్ట్రం నిధుల లేమితో సతమత మవుతున్న ఆర్థిక వ్యవస్థను దారిలో పెడుతున్నామని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.