V6 News

మ్యాంగో పల్ప్ కాదు విషం.. 3 వేల 800 కిలోల కల్తీ మామిడి గుజ్జును పారబోశారు !

మ్యాంగో పల్ప్ కాదు విషం.. 3 వేల 800 కిలోల కల్తీ మామిడి గుజ్జును పారబోశారు !

ఎండాకాలం వచ్చిందంటే చాలు.. రోడ్లపై మనకు ఎక్కువగా కనిపించేవి పుచ్చకాయలు, మామిడి కాయలు. మ్యాంగో జ్యూస్లు, మ్యాంగో పల్ప్ అదేనండీ మామిడి కాయ గుజ్జుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. మ్యాంగో పల్ప్ను ప్యాక్ చేసి కూడా అమ్ముతున్నారు. కేవలం అర కప్పు మామిడి గుజ్జు.. మన శరీరానికి అవసరమయ్యే రోజువారీ విటమిన్ సి అవసరాలలో 75 శాతం అందిస్తుంది.

ఇందులోని విటమిన్ ఎ, విటమిన్ సిలు రోగనిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి, కొల్లాజెన్ అనే ప్రొటీన్ ఉత్పత్తికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే.. సమ్మర్లో మ్యాంగో పల్ప్ను ఎక్కువగా కొని వాడుతుంటారు. కానీ.. ఈ మ్యాంగో పల్ప్ను కూడా కల్తీ చేసేస్తున్నారు. మహారాష్ట్రలో మామిడి పండ్లు, మామిడి సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది.

ఈ క్రమంలో.. పుణెలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మ్యాంగో సంబంధిత ఉత్పత్తుల తయారీ కేంద్రాలపై దృష్టి పెట్టారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పుణె జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ దాడుల్లో 3 వేల 800 కిలోలకు పైగా కల్తీ మామిడి గుజ్జును అధికారులు సీజ్ చేశారు. ఆ తర్వాత..  రంగులు కలిపి.. ఇతర కల్తీ పదార్థాలను ఉపయోగించి మ్యాంగో పల్ప్ తయారు చేసినట్లు గుర్తించారు.

FDA టీం మావల్ తాలూకాలోని ఉర్సే గ్రామంలో ఉన్న ఒక మ్యాంగో పల్ప్ తయారీ యూనిట్‌లో ఆకస్మిక తనిఖీలు చేసింది. ఈ యూనిట్‌ అక్రమ్ గులాం అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు గుర్తించారు. తనిఖీ సమయంలో.. ఫుడ్ సేఫ్టీ రూల్స్ను ఉల్లంఘించి.. వాడకూడని ఫుడ్ కలర్స్, ఇతర పదార్థాలను ఉపయోగించి మామిడి గుజ్జును తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.