V6 News

నేడు లాస్ట్ ఫేజ్ పోలింగ్..ఎగ్జిట్ ఫోల్స్ లో వచ్చేదెవరో?

నేడు లాస్ట్ ఫేజ్ పోలింగ్..ఎగ్జిట్ ఫోల్స్ లో వచ్చేదెవరో?
  • తటస్థ పార్టీలతో కాంగ్రెస్​ మంతనాలు
  • ఎస్పీ, బీఎస్పీ చీఫ్​లతో చంద్రబాబు భేటీలు
  • రాహుల్​ గాంధీతోనూ సమావేశం
  • ఎన్డీయే పార్టీలతో
    బీజేపీ నేతల సమాలోచనలు
  • హంగ్​ వస్తే ఏం చేయాలన్నదానిపై ముందస్తు చర్చలు
  • సర్వేపై లగడపాటి లీకులు
  • తెలంగాణలో కారు,
    ఏపీలో సైకిల్​ అంటూ కామెంట్​

లాస్ట్​ ఫేజ్​లో పైచేయి ఎవరిదో?

ఇప్పటివరకు ఆరు విడతల్లో 483 సీట్లకు ఎన్నికలు జరుగగా.. ఆదివారం చివరి దశలో 59 సీట్లకు పోలింగ్​ జరుగనుంది. ప్రధాని మోడీ పోటీచేస్తున్న వారణాసితోపాటు పంజాబ్​లోని అన్ని సీట్లు కూడా ఈ లాస్ట్​ ఫేజ్​లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్​లో 13, పంజాబ్​లో 13, పశ్చిమ బెంగాల్​లో 9, బీహార్​లో 8, మధ్యప్రదేశ్​లో 8, హిమాచల్​ప్రదేశ్​లో 4, జార్ఖండ్​లో 3, చండీగఢ్​లో ఒక స్థానానికి చివరి దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ 59 సీట్లలో 30 బీజేపీ సిట్టింగ్​ స్థానాలే. దీంతో ఈ ఫేజ్​లో ఎవరిది పైచేయి కానుందో ఆసక్తికరంగా మారింది. మొత్తం 543 ఎంపీ సీట్లలో తమిళనాడులోని వెల్లూరు స్థానానికి ఎన్నిక వాయిదా పడింది.

ఎగ్జిట్ పోల్స్​లో వచ్చేదెవరో?

చివరి దశ పోలింగ్​ ఇలా ముగియగానే అలా వచ్చేసే ఎగ్జిట్​ పోల్స్​పై రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు రిజల్ట్స్​ కన్నా.. ప్రైవేటు సంస్థలు చేపట్టే ఈ ముందస్తు రిజల్ట్స్​పైనే వారు గంపెడాశలు పెట్టుకున్నారు. ఏప్రిల్​ 11న ఫస్ట్​ ఫేజ్​లో ఎన్నికలను ఎదుర్కొన్న క్యాండిడేట్లది ఫలితాల కోసం సుమారు 42 రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి. ఇప్పటికే వివిధ పార్టీలు సొంత సర్వేలు చేయించుకొని గెలుపోటములపై ఓ అంచనాకు వచ్చేశాయి. సొంత సర్వేలు ఎలా ఉన్నా.. ఆదివారం సాయంత్రం పోలింగ్​ ముగియగానే వచ్చే ఎగ్జిట్​ పోల్స్​ రిజల్ట్స్  కోసం పార్టీలన్నీ ఎదురు చూస్తున్నాయి. అన్ని జాతీయ మీడియా సంస్థలు వివిధ సర్వే సంస్థలతో కలిసి ఎగ్జిట్​ పోల్​ సర్వే చేపట్టాయి.

ఏడు దశల లోక్​సభ ఎన్నికల ఘట్టానికి ఆదివారం చివరి దశ పోలింగ్​తో తెరపడనుంది. ఈ నెల 23న రిజల్ట్స్​ రానున్నాయి. వాటికన్నా ముందు వెలువడే ఎగ్జిట్​ పోల్స్​లో తమ అంచనాలు అటూ ఇటూ అయినా.. క్యాండిడేట్లు, పార్టీలు జారిపోకుండా ప్రధాన పార్టీలు ప్రయత్నాలు వేగవంతం చేశాయి. పవర్​ పాలి‘ట్రిక్స్’ను మొదలుపెట్టాయి. క్యాంపులు, చర్చలకు తెరతీశాయి. మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్తున్న బీజేపీ నేతలు.. ఎంతకైనా మంచిదని ఎన్డీయేలోని పార్టీలతో సమాలోచనలు జరుపుతున్నారు. హంగ్​ పరిస్థితులు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్​ నేతలు కూడా తమ కసరత్తును ముమ్మరం చేశారు. మద్దతిస్తున్న పార్టీలతో పాటు తటస్థంగా ఉన్న పార్టీలతో చర్చలు సాగిస్తున్నారు.  కాంగ్రెస్​ నాయకత్వంలోని యూపీఏకు మద్దతిస్తున్న టీడీపీ చీఫ్​ చంద్రబాబు రంగంలోకి దిగి ఢిల్లీ, యూపీలో కీలక నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలే ఎక్కువ సీట్లు సాధిస్తాయని ప్రీపోల్​ సర్వేలు అంచనాలు వేయడంతో ఆ పార్టీలపైన ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్​ పెట్టాయి.

రంగంలోకి కాంగ్రెస్​ దూతలు

ఇటు కాంగ్రెస్​కు, అటు బీజేపీకి మద్దతివ్వకుండా తటస్థంగా ఉంటున్న ప్రాంతీయ పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్​ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆ పార్టీ దూతలుకొందరు రంగంలోకి దిగారు. ఈ నెల 23న లోక్​సభ ఎన్నికల ఫలితాలు రానున్న నేపథ్యంలో అదే రోజు ప్రతిపక్షాల సమావేశం నిర్వహించాలని ఇప్పటికే యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి రావాలని పలు పార్టీలకు ఆమె లేఖలు పంపారు. తటస్థ పార్టీలను కూడగట్టే బాధ్యతను కాంగ్రెస్​ సీనియర్​ నేత, మధ్యప్రదేశ్​ సీఎం కమల్​నాథ్​కు అప్పగించారు. ఆయన తన పనిని మొదలుపెట్టారు. తటస్థంగా ఉన్న బీజేడీ చీఫ్​, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌‌తో కమల్​నాథ్​ చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్​ వర్గాలు చెప్తున్నాయి. మిగతా తటస్థ పార్టీలతోనూ ఆయన మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాల సమావేశానికి ఆ పార్టీలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. బీజేపీని గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా కాంగ్రెస్​ ముందుకు సాగుతున్నది. కేంద్రంలో హంగ్​ ఏర్పడితే తప్పకుండా యూపీఏనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ చెబుతోంది. ఒకవేళ తమకు సరిపడా సీట్లు రాకుండా ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ సీట్లు వస్తే.. ఆ పార్టీలను కలుపుకొని పోవడమో, లేక ఆ పార్టీలకే మద్దతిచ్చి పవర్​లోకి తీసుకురావడమో చేస్తామని కాంగ్రెస్​ అంటోంది. ఈ అంశాన్ని కూడా తెరమీదికి తెస్తూ తటస్థ పార్టీలతో హస్తం నేతలు చర్చలు జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.  ‘‘ప్రధాని పదవి మా పార్టీకి దక్కకపోయినా సరే.. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం” అని ఇప్పటికే గులాం నబీ ఆజాద్​ లాంటి కాంగ్రెస్​ సీనియర్​ నేతలు ప్రకటించారు.

బీజేపీ మంతనాలు

బీజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకొని ప్రతిపక్షాలు పవర్​లోకి వస్తాయని కాంగ్రెస్​ చీఫ్​రాహుల్​ చెప్తుండగా.. ఆ చాన్స్​ లేదని, 300 సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారం చేపడుతామని బీజేపీ చీఫ్​ అమిత్​ షా అంటున్నారు. అయితే.. పవర్​కు కావాల్సిన 272 సీట్లు రాకపోతే ఏమిటన్న దానిపై బీజేపీ నేతలు సమాలోచనలు జరుపుతున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే 336 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో ఒక్క బీజేపీనే 282 సీట్లు గెలుచుకుంది. అయితే.. వివిధ కారణాల వల్ల ఎన్డీయే నుంచి టీడీపీ వంటి కొన్ని పార్టీలు బయటకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే మ్యాజిక్​ ఫిగర్​కు అటూ ఇటుగా ఆగిపోవచ్చని, హంగ్​ వచ్చే పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయని ముందస్తు సర్వేలు అంచనా వేశాయి. తామే మళ్లీ అధికారంలోకి వస్తామని బలంగా చెప్తున్న బీజేపీ నేతలు.. ఎలాగైనా మంచిదని వివిధ పార్టీలతో ముందస్తు చర్చలు సాగిస్తున్నట్లు ఢిల్లీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. ఒకవైపు ఎన్డీయేలోని వివిధ పార్టీలతో సంప్రదింపులు జరుపుతూనే.. తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతోనే బీజేపీలోని కొందరు ముఖ్యులు మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల ప్రచారం పూర్తవడంతో శనివారం ప్రధాని మోడీ కేదర్​నాథ్​ పర్యటనకు వెళ్లగా, బీజేపీ చీఫ్​ అమిత్​ షా తన కుటుంబసభ్యులతో కలిసి గుజరాత్​లోని సోమనాథ్​ ఆలయాన్ని సందర్శించుకున్నారు.