V6 News

తిరుమలలో పీఏసీ-1, ఆస్థాన మండపాల ఆదునీకారణ.. భక్తులకు మెరుగైన సదుపాయాలు..

తిరుమలలో పీఏసీ-1, ఆస్థాన మండపాల ఆదునీకారణ.. భక్తులకు మెరుగైన సదుపాయాలు..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశించారు టీటీడీ ఈవో రవిచంద్ర. బుధవారం ( ఏప్రిల్ 22 ) తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు సూచనలు చేశారు ఈవో రవిచంద్ర.

ప్రతిరోజూ వేలాదిగా వచ్చే భక్తులకు ప్రస్తుత వసతి సదుపాయాలు సరిపోవడం లేదని... వాటిని విస్తరించేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా తిరుపతిలో వసతి సదుపాయాల పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు రవిచంద్ర.

వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో మాడవీధులు, ఆలయ పరిసరాలు, ముఖ్య ప్రదేశాల్లో నిరంతరం నీటి పిచికారీ చేయాలని ఆదేశించారు.భక్తుల నుండి అభిప్రాయాలు సేకరించి, వాటి ఆధారంగా సేవలను మరింత మెరుగుపరచాలని అన్నారు.. అన్ని ఆలయాల్లో క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు రవిచంద్ర.

తిరుమలలో నెయ్యి నిల్వ ట్యాంకులు, ముడి సరుకుల గోదాముల సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త గోదాములు నిర్మించాలని, పెండింగ్ వ్యర్థాలను త్వరగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఏసి-1, ఆస్థాన మండపాలను ఆధునికీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు.

శ్రీవారి సేవ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ఇతర ఆలయాలకు విస్తరించేలా చర్యలు తీసుకోవాలని.. భవిష్యత్తులో వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, సాఫ్ట్‌వేర్ నిపుణుల సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అన్నారు.

అంతే కాకుండా.. ఈ సమావేశంలో టిటిడి కళ్యాణ మండపాల నిర్వహణ, ఎస్వీబీసీ, స్విమ్స్, ఎఫ్ ఎం ఎస్, వసతి గృహాలు, ఎస్ ఎస్ డి, ఎస్ ఈ డీ, శ్రీవాణి దర్శనం టికెట్ల జారీ తదితర అంశాలపై చర్చించారు.