ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించిన రెండో దశ శాంతి చర్చలపై శుక్రవారం లోపు శుభవార్త ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. రాబోయే 36 నుంచి 72 గంటల్లో శాంతి చర్చలు తిరిగి ప్రారంభం కావచ్చని న్యూయార్క్ పోస్ట్ బుధవారం రిపోర్ట్ చేసింది. అయితే.. ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై తాము ఇంకా ఎలాంటి వైఖరిని ప్రకటించలేదని ఇరాన్ స్పష్టం చేసింది.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌కు అనుబంధంగా ఉన్న తస్నిమ్ న్యూస్ అనే ఏజెన్సీ.. X పేజ్లో ఒక పోస్ట్ చేసింది. ట్రంప్ మళ్ళీ అబద్ధం చెప్పారని, శుక్రవారం చర్చలు జరపడానికి ఇరాన్ ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. శాంతి చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు ఇరాన్‌తో అమెరికా కాల్పుల విరమణను పొడిగించిన సంగతి తెలిసిందే.
పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా రెండో విడత శాంతి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు బుధవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. శాంతి చర్చలకు మరింత సమయం ఇచ్చేందుకు ఇరాన్‌తో అమెరికా కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. మరోవైపు, హార్మూజ్లో దిగ్బంధాలు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా చర్చలను లొంగుబాటుగా మార్చాలని లేదా మళ్లీ యుద్ధం ప్రారంభించడాన్ని సమర్థించుకోవాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఇరాన్ ఆరోపించింది.
అమెరికా, ఇజ్రాయెల్తో మళ్లీ యుద్ధం మొదలైతే తమ వద్ద "కొత్త వ్యూహాలు" సిద్ధంగా ఉన్నాయని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. అయితే, హార్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ఉన్న నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడంతో చర్చలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్టు ఇరాన్ ఇదివరకే ప్రకటించింది. అమెరికా మితిమీరిన డిమాండ్లు, అవాస్తవిక అంచనాలు, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగానే తాము చర్చల్లో పాల్గొనడం లేదని తెలిపింది.

