V6 News

రాజస్థాన్ క్లాస్–మాస్ ఫర్ఫామెన్స్ .. చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్

రాజస్థాన్ క్లాస్–మాస్ ఫర్ఫామెన్స్ .. చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్

LSG vs RR: ఐపీఎల్ 2026లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ (LSG), రాజస్థాన్ బౌలర్ల ధాటికి 119 పరుగులకే కుప్పకూలింది. మిచెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో పోరాడినప్పటికీ జట్టుకు ఓటమి తప్పలేదు. స్వల్ప లక్ష్య ఛేదనలో లక్నో ఆరంభం అత్యంత దారుణంగా మొదలైంది. రాజస్థాన్ పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో లక్నో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఓపెనర్‌గా వచ్చిన ఆయూష్ బదోనీ (0) 9 పరుగుల వద్దే దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. కెప్టెన్ రిషబ్ పంత్ నాండ్రే బర్గర్ వేసిన బుల్లెట్ లాంటి బంతికి కీపర్ ధ్రువ్ జురెల్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన ఐడెన్ మార్క్రమ్ కూడా జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సున్నాకే వెనుదిరిగాడు.దీంతో కేవలం 11 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయిన లక్నో పీకల్లోతు కష్టాల్లో పడింది.

మిచెల్ మార్ష్ ఒంటరి పోరాటం: 
ఒకవైపు వికెట్లు పడుతున్నా, మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (55 పరుగులు, 41 బంతులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) కిరాక్ హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. నికోలస్ పూరన్ (22) అతనికి కాసేపు సహకరించినప్పటికీ, జడేజా బౌలింగ్‌లో పూరన్ అవుట్ కావడంతో లక్నో ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత హిమ్మత్ సింగ్ (15) ఒక భారీ సిక్సర్ కొట్టి రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరగా 105 పరుగుల వద్ద మార్ష్ కూడా రియాన్ పరాగ్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో లక్నో కథ ముగిసింది. ముకుల్ చౌదరి (7), మహమ్మద్ షమీ (6), మయాంక్ యాదవ్ (5) వంటి లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా త్వరగానే అవుట్ కావడంతో లక్నో 119 పరుగులకే ఆలౌట్ అయింది.

Also Read : కష్టాల్లో రాజస్థాన్.. 32 పరుగులకే 3 వికెట్లు డౌన్

అద్భుతంగా రాజస్థాన్ బౌలింగ్: 
రాజస్థాన్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లక్నో నడ్డి విరిచారు. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్ కీలకమైన 3 వికెట్లు తీసి లక్నోను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ చెరో 2 వికెట్లతో రాణించగా, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టి రాజస్థాన్ రాయల్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తమ ఆధిపత్యాన్ని చాటుకోగా, లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం తమ హోమ్ గ్రౌండ్‌లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.