నిరుద్యోగులపై లాఠీఛార్జ్  నిరంకుశ చర్య..20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్: కేటీఆర్ 

నిరుద్యోగులపై లాఠీఛార్జ్  నిరంకుశ చర్య..20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్: కేటీఆర్ 

హైదరాబాద్, వెలుగు: న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న  నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేయడం హేయమైన చర్యని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపు తున్న అభ్యర్థులను అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ ప్రజా పాలననా? అని ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని హైద రాబాద్​తోపాటు అన్ని వర్సిటీల్లోని విద్యార్థు లు డిమాండ్​ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికల ముందు ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, 'మెగా నోటిఫికేషన్లు', 'జాబ్ క్యాలెండర్' అంటూ కూతలు కూసి యువతను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో 20 వేలకుపైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలనుకోవడం అన్యాయమన్నారు. కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల భవిష్యత్​ను దృష్టిలో ఉంచుకుని 20 వేల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.