లంచం తీసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలను విచారించవచ్చు: సుప్రీం కోర్టు

 లంచం తీసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేలను విచారించవచ్చు: సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో మరో కీలక తీర్పు వెలువడింది. లంచం తీసుకొని శాసనసభల్లో మాట్లాడటం, ఓటు వేసే ప్రజాప్రతినిధులు విచారణ నుంచి తప్పించుకోలేరని సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈరోజు (మార్చి 4)న తీర్పు ఇచ్చింది. పార్లమెంటరీ అధికారాల్లో లంచానికి రక్షణ లేదని కోర్టు తేల్చి చెప్పింది. రాజ్య సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు లంచం తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద వ్యక్తిని విచారించవచ్చని కోర్టు తెలిపింది. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు  ఆర్టికల్స్ 105(2) లేదా 194(2) లు ఫ్రీడం ఇస్తాయి కానీ, ఎవ‌రైనా స‌భ్యుడు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డితే  వారికి ఆర్టికల్ 105 లేదా 194 ప్రకారం ఎలాంటి రక్షణ ల‌భించ‌ద‌ని తీర్పు నొక్కి చెప్పింది. తీర్పు వెలువెడిన కాసేపటికే ప్రధాని మోదీ సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఎక్స్ లో తెలిపారు.

అప్పట్లో ఏం జరిగింది?
1993లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మైనారిటీ ప్రభుత్వం అవిశ్వాసాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో జార్ఖండ్ ముక్తి మోర్చా( జేఎంఎం) ఎంపీగా ఉన్న శిబు సోరెన్‌ సహా ఇదే పార్టీకి చెందిన మరో నలుగురు ఎంపీలు లంచాలు తీసుకుని అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వీరి మద్దతుతో మైనార్టీలో ఉన్నప్పటికీ పీవీ ప్రభుత్వం గట్టెక్కింది. ఆ తర్వాత సోరెన్‌ సహా ఐదుగురు ఎంపీలపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది.  దీనిని విచారించిన సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులకు లంచం కేసుల విచారణ నుంచి మినహాయింపునిస్తూ 1998లో అప్పటి ధర్మాసనం తీర్పు వెలువరించింది. 
 
కీలక తీర్పు
రాజ్యాంగం ప్రసాధించిన పార్లమెంటరీ అధికారాల ద్వారా అవినీతి నుంచి ప్రజాప్రతినిధులకు ఎలాంటి రక్షణ ఉండబోదని ఈరోజు సుప్రీం కోర్టు డీవై చంద్రచూడ్  ధ‌ర్మాసనం వెల్లడించింది. 1998లో ఇచ్చిన తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పింది. అవినీతి ఆరోపణలు ప్రజాజీవితంలో విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఎంపీలు, ఎమ్మెల్యేల‌పై వ‌చ్చే అవినీతి, లంచాల ఆరోప‌ణ‌ల‌పై కేసులు న‌మోదు చేయ‌డంతోపాటు విచార‌ణ‌కు సైతం జరపవచ్చని స్పష్టం చేసింది.