బెంగళూరు మిస్టరీ: వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న ప్రియుడి కోసం 6 ఏళ్ల కన్నకూతురిని చంపిన లేడీ లాయర్

బెంగళూరు మిస్టరీ: వెయ్యి కోట్ల ఆస్తి ఉన్న ప్రియుడి కోసం 6 ఏళ్ల కన్నకూతురిని చంపిన లేడీ లాయర్

బెంగళూరులో వెలుగుచూసిన షాకింగ్ క్రైమ్ స్టోరీ కన్నకూతురి కంటే ప్రియుడే ఎక్కువనుకున్న ఒక లేడీ లాయర్ అమానుషత్వానికి నిలువెత్తు నిదర్శనం. దావణగెరెకు చెందిన క్లౌడ్9 ఇంటర్నేషనల్ స్కూల్ ఓనర్ ప్రవీణ్ బసప్పకు, ప్రియాంక అనే మహిళా న్యాయవాదితో 2007లో పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. వీరి 18 ఏళ్ల వైవాహిక బంధం 2025 చివరలో ఒక్కసారిగా పక్కదారి పట్టింది. బెంగళూరులోని 25 ఎకరాల భూ వివాదానికి సంబంధించిన కేసును వాదించడానికి వెళ్లిన ప్రియాంక.. అక్కడ తన పాత ప్రేమికుడు, వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పుకునే రియల్ ఎస్టేట్ డెవలపర్ మోహన్‌ను తిరిగి కలుసుకుంది. ఈ పరిచయం కాస్తా వివాహేతర బంధానికి దారితీయడంతో.. వారిద్దరూ కాశీలో రహస్యంగా పెళ్లి చేసుకుని, దుబాయ్‌లో న్యూ ఇయర్ వేడుకలను కూడా జరుపుకున్నారు.

ప్రియుడు మోహన్ మోజులో పడిన ప్రియాంక ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన ఆమె.. పిల్లలను దూరం చేస్తానంటూ భర్త ప్రవీణ్‌ను బెదిరించి విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకుంది. విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్దే ఉండిపోగా.. ఆరేళ్ల చిన్నకూతురు వెన్నెల మాత్రం ప్రియాంక, మోహన్‌లతో కలిసి సీగేహళ్లిలోని ఒక విల్లాలో నివసించసాగింది. తమ విలాసవంతమైన జీవితానికి, ఏకాంతానికి ఆ చిన్నారి అడ్డుగా ఉందనుకుంది జంట. అందులో భాగంగానే మార్చి 24న వెన్నెల పుట్టినరోజు సెలబ్రేషన్ లో ఒక భయంకరమైన కుట్రకు తెరలేపారు.

పాప పుట్టినరోజు నాడు ప్రియాంక ఆమెకు బిర్యానీ, ఐస్‌క్రీమ్ తినిపించి.. కారులో ఏసీ ఆన్ చేసి పడుకోబెట్టింది. ఆపై ఆ చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్‌తో కలిసి కాఫీ షాప్‌కు వెళ్లిపోయింది. రాత్రి తిరిగి వచ్చాక పాపను బెడ్‌పై పడుకోబెట్టానని, మరుసటి రోజు ఉదయం చూసేసరికి వెన్నెల స్పృహ లేకుండా పడి ఉందని నాటకమాడింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మొదట దీన్ని సాధారణ మరణంగానే చిత్రీకరించాలని చూసినప్పటికీ.. తండ్రి ప్రవీణ్ పట్టుబట్టి పోస్టుమార్టం చేయించడంతో అసలు నిజాలు బయటపడటం ప్రారంభమైంది.

ఏప్రిల్ 4న వచ్చిన పోస్టుమార్టం నివేదికను ఇంగ్లండ్‌లో పీడియాట్రీషియన్‌గా పనిచేస్తున్న ప్రవీణ్ సోదరి డాక్టర్ పూర్ణిమ పరిశీలించి, పాప మరణంలో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని, ఇది ఖచ్చితంగా హత్యేనని గుర్తించారు. ప్రియుడి కోసం కన్నకూతురినే అడ్డుతొలగించుకున్నారని గ్రహించిన ప్రవీణ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రాథమిక విచారణ అనంతరం జూన్ 4న ప్రియాంక, మోహన్‌లపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, ముందస్తు బెయిల్ పొందిన మోహన్ బెయిల్‌ను కోర్టు ద్వారా రద్దు చేయించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. లవర్ కోసం కన్నబిడ్డను ఊపిరాడకుండా చేసి చంపారా లేదా విషమిచ్చారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. నిందితురాలైన లేడీ లాయర్ ప్రియాంక ప్రస్తుతం పరారీలో ఉంది. చదువుకుని లాయర్ వృత్తిలో ఉన్న ఒక తల్లి తన కూతురిని ఇంత దారుణంగా ఎలా చంపగలిగింది అంటూ నెటిజన్లు ఈ క్రైమ్ స్టోరీపై స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో.