నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. కార్యకర్తలే ముఖ్యం

నాయకులు వస్తుంటారు, పోతుంటారు.. కార్యకర్తలే ముఖ్యం
  • సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క

మేడ్చల్: ఎంతో మంది నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ అధికారంతో సంబంధం లేకుండా అభిమానంతో నిరంతరం జెండా మోసే కార్యకర్తలే ముఖ్యమని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం కొంపల్లిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబెర్ షిప్ డ్రైవ్ ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. బ్లాక్, మండల కాంగ్రెస్ నేతలకు డిజిటల్ మెంబర్ షిప్ పై రెండు రోజులపాటు జరుగుతున్న అవగాహన సదస్సులో భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీకైనా క్రియాశీలక నిర్మాణం ముఖ్యం అన్నారు,  వ్యక్తులు, నాయకులు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ కార్యకర్తలే పార్టీకి ముఖ్యం అని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన తెలిపారు. 
దేశంలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ దే
దేశంలో రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, గాంధీయిజమే కాంగ్రెస్ భావజాలం, కాంగ్రెస్ సిద్ధాంతమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎన్నో ఏళ్లు అధికారంలో లేకున్నా ఎన్ని హింసలు పెట్టినా కాంగ్రెస్ జెండా మోస్తున్న ఘనత కార్యకర్తలదని కొనియాడారు. ప్రధాని అయ్యే అవకాశం సోనియా గాంధీకి వచ్చినా కూడా పార్టీ కోసం త్యాగం చేసిన గొప్ప నాయకురాలన్నారు. దేశం కోసం ఇందిరమ్మ కుటుంబం చేసిన త్యాగాల ముందు ఏ పార్టీ నాయకులు కూడా పనికి రారని ఆయన పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీపై కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారంతో బురద జల్లుతున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం దేశం మతోన్మాద శక్తుల చేతుల్లో దేశం ఉందని.. దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. దేశాన్ని ఒకవైపు బీజేపీ, మరో వైపు రాష్ట్టాన్ని దోపిడీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. టీమ్ వర్క్ తోనే గెలుపు సాధ్యమని ఆయన సూచించారు.