మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టాలి: అంబేద్కర్ సంఘం లీడర్ల

మంత్రి మల్లారెడ్డిపై అట్రాసిటీ  కేసు పెట్టాలి: అంబేద్కర్ సంఘం లీడర్ల

ఘట్​కేసర్, వెలుగు: బుధవారం ఘట్​కేసర్ మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న 12వ వార్డు కౌన్సిలర్ మేకల పద్మారావును ‘దళిత కౌన్సిలర్’ అంటూ బీఆర్ఎస్ లీడర్ బండారి శ్రీనివాస్ గౌడ్ అవమానించాడని వార్డు ప్రజలు, అంబేద్కర్ సంఘం లీడర్లు గురువారం రాస్తారోకో చేపట్టారు. అనంతరం మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. మంత్రితోపాటు శ్రీనివాస్ గౌడ్ పై అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్​చేస్తూ పోలీసులకు కంప్లయింట్ చేశారు. 

మంత్రి మల్లారెడ్డి నిధుల కేటాయింపుపై వివక్షతోపాటు పోలీసులతో అరెస్టు, పార్టీ లీడర్లతో తిట్టించడంతో ఆగ్రహించిన వార్డు ప్రజలు అంబేద్కర్ కమ్యూనిటీ భవనం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్ ఏర్పడింది. సీపీఎం జిల్లా లీడర్ చింతల యాదయ్య, అంబేద్కర్ సంఘం లీడర్లు మాట్లాడుతూ దళిత వార్డు, దళిత కౌన్సిలర్ అనే మాటలు మంత్రి మల్లారెడ్డి సపోర్ట్​తోనే అన్నాడని, వారిద్దరిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, లీడర్లు కౌన్సిలర్ మేకల పద్మారావును కలిసి మద్దతు తెలిపారు.