హైదరాబాద్, వెలుగు: నీట్ పేపర్ లీకేజీ, ఎన్‌టీఏ వైఫల్యాలపై దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమం గెలిచిందని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి బర్కత్‌పుర సిగ్నల్ వరకు ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఢిల్లీ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై కేంద్రం లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగించి అణచివేయాలని చూసినా, రక్తం చిందించి పోరాడి కేంద్రం మెడలు వంచామని కొనియాడారు. విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్న ఎన్‌టీఏను తక్షణమే రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర నేతలు అనిల్, మహేశ్, ఏఐడీఎస్‌ఓ నాయకులు నితీశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ రెడ్డి, డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావిద్, పాల్గొన్నారు.
