
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర హోంగార్డ్స్ జేఏసీ డిమాండ్ చేసింది. లేకపోతే గణేశ్ పండుగ, రానున్న ఎలక్షన్ బందోబస్తును బహిష్కరిస్తామని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి హరీశ్ రావును జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ, ప్రధాన కార్యదర్శి పాకాల రాజశేఖర్ తదితరులు కలిసి హోంగార్డ్ సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో 24 గంటలు విధులు నిర్వహిస్తూ ప్రతి పండుగలకు సేవలు అందిస్తున్న హోంగార్డ్స్ ను పర్మినెంట్ చేయాలని కోరారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు హోంగార్డులను పర్మినెంట్ చేయాలని కోరారు. లేకపోతే సెప్టెంబర్ 16న ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో శాంతియుత దీక్ష చేస్తామన్నారు.