ఇది న్యాయమేనా కావ్య పాప..! ఉప్పల్ స్డేడియం ముందు మెరుపు ధర్నా.. ఎందుకంటే..?

ఇది న్యాయమేనా కావ్య పాప..! ఉప్పల్ స్డేడియం ముందు మెరుపు ధర్నా.. ఎందుకంటే..?

సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుకు తెలంగాణ టీమ్. కానీ జట్టులో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలంగాణ ప్లేయర్ లేడు. తెలంగాణకు చెందిన చాలా మంది ప్లేయర్లు వేలంలో ఉన్న కూడా ఎస్ఆర్‎హెచ్ మేనేజ్మెంట్ ఒక్కరిని కూడా కొనుగోలు చేయలేదు. మరీ ఇది న్యాయమేనా.. టీమ్ మన రాష్ట్రానిది కానీ రాష్ట్రానికి చెందిన ఒక్క ఆటగాడు కూడా జట్టు లేడు. ఇదే అంశం తెలంగాణ క్రికెట్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో మంగళవారం (మార్చి 24) ఉప్పల్ స్టేడియం ముందు టీడీసీఏ, విద్యార్థి సంఘాల మెరుపు ధర్నాకు దిగాయి. 

టీడీసీఏ అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‎లో తెలంగాణ ప్లేయర్లకు చోటు ఏదని ప్రశ్నించారు. పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‎ను ఇంగ్లాండ్ లీగ్‎లో రూ. 2.34 కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ఎస్ఆర్‎హెచ్ మేనేజ్మెంట్ సన్ గ్రూప్ దగ్గర పైసలు ఉన్నాయి కానీ తెలంగాణలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లకు జట్టులో చోటు ఇవ్వడానికి వాళ్ల దగ్గర పైసలు లేవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోట్లు ఖర్చు పెట్టి పాకిస్థాన్ ప్లేయర్లును కొంటుంటే వాళ్లేమో ఇండియా పైనా ఉగ్రదాడులు చేస్తున్నారని మండిపడ్డారు. డెక్కన్ చార్జర్స్ యాజమాన్య హక్కులు సన్ రైజర్స్ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి తెలంగాణ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, పంజాబ్ జట్లు తెలుగు ప్లేయర్లకు అవకాశాలు ఇస్తున్నప్పుడు సన్ రైజర్స్ లోకల్ ప్లేయర్లను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. జట్టు సీఈఓ మొదలు సహాయ సిబ్బంది, కింది స్థాయి సిబ్బంది, ఆఖరికి ఎస్ ఆర్ హెచ్ మీడియా మేనేజర్ వరకు అందరూ తమిళ వాళ్లేనని అన్నారు. 

►ALSO READ | Rajasthan Royals: అమ్ముడుపోయిన రాజస్థాన్ రాయల్స్.. ఏకంగా రూ.  15 వేల కోట్లకు..

మీకు తమిళనాడుపై అంత ప్రేమ ఉన్నప్పుడు సన్ రైజర్స్ తమిళనాడు అని పేరు మార్చుకొని అక్కడే మ్యాచులు నిర్వహించుకోండి.. అక్కడే వ్యాపారం చేసుకోండన్నారు. మీకు తెలంగాణ పైసలు కావాలి.. ఇక్కడ బిజినెస్ కావాలి.. మా వనరులన్నీ వాడుకుంటారు.. కానీ ప్రతిభావంతులైన మా పిల్లలకు ఆడే అవకాశాలు ఇవ్వరా అని ప్రశ్నించారు. 
ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదని అసహనం వ్యక్తం చేశారు. 

ఎప్పుడైతే తమిళనాడుకు చెందిన సన్ నెట్వర్క్ చేతికి హైదరాబాద్ ఫ్రాంచైజీ వెళ్లిందో అప్పటి నుంచి ఇదే కథ అని అన్నారు. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరి, ఎస్ ఆర్ హెచ్ యజమాని కావ్య మారన్ స్పందించి తెలంగాణ క్రికెటర్లకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభం కాబోతున్న వేళ ఉప్పల్ స్డేడియం ముందు తెలంగాణ క్రికెట్ అభిమానులు ధర్నాకు దిగడం చర్చనీయాంశంగా మారింది.