
కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడంతో స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులు, షాపింగ్ మాల్స్, థియేటర్లు అన్నీ మూతపడ్డాయి. దీంతో అడవుల్లో ఉండే వన్యప్రాణులు స్వేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నాయి. ఇటీవల తిరుమలలో కూడా అడవిమృగాలు రోడ్లపైకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్ లోని ఓ పాఠశాలలోకి సింహం వచ్చింది. గిర్ సోమనాథ్ జిల్లాలోని ఉనా గ్రామ సమీపంలో ఓ జింకను వేటాడుతూ.. స్కూల్ ఆవరణలోకి వచ్చింది. స్కూల్ బిల్డింగ్ లోపలోకి ఆ సింహం వెళ్లడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే ఓ పైపు సాయంతో స్కూల్ గేట్లను మూసివేశారు. దీంతో సింహం స్కూల్ బిల్డింగ్ లో చిక్కుకుపోయింది. గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ..వెంటనే వాళ్లు స్కూల్ ఆవరణలో ఉన్న సింహాన్ని బోనులో బంధించి జసధర్ ఎనిమల్ కేర్ సెంటర్ కు తీసుకెళ్లారు. అక్కడ దానికి కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత అడవిలో వదిలిపెట్టారు.