పసిపిల్లల తల్లుల కోసం ఫుడ్​ ఛానెల్​ పెట్టి..

పసిపిల్లల తల్లుల  కోసం ఫుడ్​ ఛానెల్​ పెట్టి..

పసి బిడ్డలకు నెలలు పెరుగుతున్న కొద్దీ ఆకలి పెరుగుతుంటుంది. కానీ, వాళ్లకి ఏది తినిపిస్తే  మంచిది, ఏవి తినిపించకూడదు..అంటూ బోలెడు డౌట్స్​ తల్లులకు. అయితే ఈ సందేహాలన్నీ న్యూట్రిషనిస్ట్​ హేమప్రియ నటేశన్​కి కూడా ఉన్నాయి.  వాటికి జవాబు వెతుకుతూ .. ఓ ఫేస్​బుక్​ గ్రూపులో చేరిందీమె. ఆ గ్రూపులో ఉన్న తల్లులందరిదీ తనలాంటి పరిస్థితే అని తెలిశాక..యూట్యూబ్​లో ‘ మై లిటిల్​ మోప్పెట్​’ అనే వంటల ​ ఛానెల్​ పెట్టింది. లక్షల్లో వ్యూస్.. ఆ ఇన్​స్పిరేషన్​తో  తాను చేసిన  స్పెషల్​ రెసిపీలని ప్రొడక్ట్స్ గా  మార్కెట్​లోకి తీసుకొచ్చింది. ఆ వచ్చే డబ్బుతో ‘లిటిల్​ మోప్పెట్​ హార్ట్​ ఫౌండేషన్’​ పెట్టి పేద పిల్లలకి గుండె ఆపరేషన్​లు చేయిస్తోంది.

హేమప్రియకి 2014లో కూతురు పుట్టింది. బిడ్డ పుట్టాక అందరు తల్లుల్లానే..వాళ్ల  ఆరోగ్యానికి సంబంధించి బోలెడు ప్రశ్నలు, భయాలు వెంటాడాయి ఆమెని. న్యూట్రిషనిస్ట్​ కావడం వల్ల ఫుడ్​ గురించి  అవేర్​నెస్​ ఉన్నప్పటికీ.. మరింత రీసెర్చ్​ చేసింది. తన కూతురికి హెల్దీ ఫుడ్​ ఇవ్వాలన్న ఆలోచనతో ఫేస్​బుక్​లో ‘పేరెంటింగ్​ అండ్​ మామ్’ అనే​ గ్రూప్​​లో కూడా  చేరింది. ఆ గ్రూప్​లో ఉన్న తల్లులంతా పిల్లలకి తినిపించే ఫుడ్​ విషయంలో పడుతున్న టెన్షన్​ చూసి, ఏ ఏజ్​ పిల్లలకి ఎలాంటి ఫుడ్​ పెట్టాలి?  ఏ ఫుడ్​ పెడితే హెల్దీ .. అన్న విషయాల గురించి అందరికీ చెప్పాలనుకుంది. తనలాంటి తల్లుల కోసం ‘మై లిటిల్​ మోప్పెట్​’ అనే యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టింది. అప్పటికి తన బిడ్డ వయసు ఒక నెలే. 

ఆ ఇన్​స్పిరేషన్​తో..

తల్లి, అత్త తయారుచేసే ట్రెడిషనల్​ రెసిపీలన్నింటినీ యూట్యూబ్​లో  పెట్టడం మొదలుపెట్టింది హేమప్రియ. వాటిల్లో పందొమ్మిది రకాల మిల్లెట్స్​తో తయారుచేసిన  ‘సత్తుమావు’ మిక్స్ రెసిపీకి లక్షల్లో వ్యూస్​ వచ్చాయి. రోజురోజుకి సబ్​స్ర్కైబర్ల సంఖ్య పెరిగిపోయింది. చాలామంది ఈ రెసిపీలని తయారుచేసి మార్కెట్​లోకి తీసుకురమ్మని అడిగారు. దాంతో పిల్లలకి న్యూట్రిషన్​ ఫుడ్​ అందించాలని డిసైడ్​ అయింది హేమ. అది కూడా పూర్తిగా ఆర్గానిక్​ పద్ధతిలో. ఉద్యోగం మానేసి మరీ దానికోసం గ్రౌండ్​ వర్క్​ మొదలుపెట్టింది. తన తల్లి సాయంతో తయారుచేసిన హెల్దీ డ్రింక్​ పౌడర్స్​ని ‘ మై లిటిల్​ మోప్పెట్​’ పేరుతోనే మార్కెట్​లో రిలీజ్​ చేసింది. 

ఫౌండేషన్​ నడుపుతోంది

నోటి మాట ద్వారానే రోజురోజుకి కస్టమర్స్​ సంఖ్య పెరుగుతూ పోయింది. నెలలు గడిచే కొద్దీ మరింత రీచ్​ వచ్చింది. దాంతో విడిగా ఒక యూనిట్​ పెట్టి, కొంతమందిని పనిలో పెట్టుకుంది. రాగి, ఖర్జూరంతో కుకీస్​, ఎనర్జీ బార్స్​, సిరియల్స్​, మిల్లెట్స్​తో నూడిల్స్​, పాన్​కేక్స్​.. ఇలా అన్ని రకాల వెరైటీలు అమ్ముతోంది హేమప్రియ. అలాగే తన​ ​ ఎక్స్​పీరియెన్స్​లని బ్లాగ్స్​లో రాస్తోంది. అందులో రెసిపీలు, పిల్లల మీల్​ ప్లాన్స్, బొమ్మలు, యాక్టివిటీల గురించి చెప్తుంది. తల్లిదండ్రుల ప్రశ్నలకి జవాబులిస్తోంది. భర్త డాక్టర్​ గోపీతో కలిసి లిటిల్​ మోప్పెట్​ ఫౌండేషన్​ నడుపుతోంది.