కరోనా ఎఫెక్ట్‌: గుజరాత్‌లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వాయిదా

కరోనా ఎఫెక్ట్‌: గుజరాత్‌లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వాయిదా

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్. నవంబర్‌లో జరగాల్సిన పలు మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, వడోదరా, భావనగర్, జామ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, 55 మున్సిపాలిటీలు, 31 డిస్ట్రిక్ట్ పంచాయతీలు, 231 తాలూకా పంచాయతీలకు నవంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అలాగే రాష్ట్రంలో మిగిలిన అన్ని స్థానిక సంస్థల పదవీ కాలం డిసెంబరులో ముగుస్తోంది. వాటి ఎన్నికలు కూడా డిసెంబర్‌లో జరగాలి. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంజయ్ ప్రసాద్ తెలిపారు. పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కలిసి 8,402 స్థానాలకు ఈ ఎన్నికలు జరగాల్సి ఉందని, దాదాపు 4 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు. అలాగే 2.8 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, లక్ష మందికి పైగా పోలీసు, సీఆర్పీఎఫ్ భద్రతా బలగాలు, 14 వేల మంది డ్రైవర్లు, ప్యూన్లు, ఇతర సిబ్బంది, 3 లక్షల మంది ఎలక్షన్ ఏజెంట్లు పని చేయాల్సి వస్తుందన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు భారీ సంఖ్యలో ప్రజలు కదలికలు, గుమిగూడే అవకాశం ఉందని, ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల నిర్వహణ వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కమిషనర్ సంజయ్ ప్రసాద్ తెలిపారు. కాగా, కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఎన్నికల కమిషన్‌ను గతంలో కోరాయి. అయితే గుజరాత్‌లో ఖాళీగా ఉన్న 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న బై ఎలక్షన్ పెట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం గమనార్హం.