లాక్‌డౌన్ నిర్ణయం కేంద్రమే తీసుకోవాలి.. రాష్టాలు కాదు

లాక్‌డౌన్ నిర్ణయం కేంద్రమే తీసుకోవాలి.. రాష్టాలు కాదు

లాక్‌డౌన్ నిర్ణయం కేంద్రమే తీసుకోవాలి కానీ రాష్టాలు తీసుకుంటే ఫలితముండదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన కరీంనగర్‌లోని సప్తగిరి కాలనీలో ఓపెన్ జిమ్‌లను మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు.

‘సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నాం. లాక్‌డౌన్ నిర్ణయం కేంద్రం తీసుకోవాలి. రాష్ట్రాలు తీసుకుంటే ఫలితం ఉండదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు సజావుగా కొనసాగుతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. రైతులకు మద్దతు ధర చెల్లిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. కరోనాతో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లకు రెండు వేల రూపాయలు, 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్సిపల్ పాలక వర్గం పని చేస్తుంది. అద్భుతంగా స్మార్ట్‌సిటీ రోడ్లు రెడీ అవుతున్నాయి. 60 డివిజన్లలో ఓపెన్ జిమ్‌లు, స్కూల్స్, కాలేజీల్లో వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేయబోతున్నాం. మొదటి విడతగా మూడున్నర కోట్లతో 30 ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో 24 గంటల తాగునీటి సరఫరాను ప్రారంభిస్తాం. వచ్చే నెలన్నరలో మానేరునదిపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జిని ఓపెన్ చేస్తాం. కరీంనగర్‌లో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అని మంత్రి గంగుల అన్నారు.