దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెడుతున్నారా.. లాక్ డౌన్ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందా.. కరోనా లాంటి సంక్షోభం అంటూ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎందుకు వ్యాఖ్యానించారు.. లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేకపోతే మోదీ ఎందుకు ఇలా అన్నారు.. ఢిల్లీలోనే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారుల భయం ఇదే ఇప్పుడు.
2026, మే 12వ తేదీ దేశ రాజధాని ఢిల్లీలో CII సమావేశం జరిగింది. భారత పరిశ్రమల సమాఖ్య సమావేశం జరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై మీరు ఏం అనుకుంటున్నారో నాకు తెలుసు.. మీ భయం నాకు తెలుసు.. లాక్ డౌన్ ఉంటుందన్న భయం వద్దు.. దేశంలో మళ్లీ లాక్ డౌన్ పెట్టే ఆలోచన లేదు. అలా అని ఇలాగే వదిలేయలేం.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించే ఆలోచన చేస్తున్నాం అని వివరించారు కేంద్ర మంత్రి. దేశంలో లాక్ డౌన్ విధించే ఆలోచన, అలాంటి ప్రణాళిక ప్రస్తుతానికి లేదని వివరించారాయన. వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు భయపడొద్దని భరోసా ఇచ్చారాయన.
దేశంలో రాబోయే 60 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని.. భవిష్యత్ పరిణామాలకు తగ్గట్టుగా వినియోగాన్ని తగ్గించాలనే ఆలోచన మాత్రమే చేస్తున్నామని వివరించారు కేంద్ర మంత్రి.
రాబోయే 45 రోజులకు సరిపడా LPG గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. దేశంలో గ్యాస్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 54 వేల మెట్రిక్ టన్నులకు పెంచామని.. ఇప్పటికిప్పుడు గ్యాస్ కొరత వచ్చే ప్రమాదం లేదని స్పష్టం చేశారాయన.
దేశంపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించటానికి.. ఇంధన రక్షణలో భాగంగానే ప్రధాని మోదీ ఈ సూచనలు చేశారని.. వ్యాపారులు ఎవరూ భయాందోళనలకు గురి కావొద్దని వివరణ ఇచ్చారు కేంద్ర మంత్రి. దేశంలో ఇంధనంపై ఎలాంటి ఆంక్షలు లేవని.. జనం సాధారణ జనజీవనం కొనసాగుతుందని.. కొరత లేదని.. ముందస్తు నిల్వలు చేసుకోవద్దని పిలుపునిచ్చారు కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి.
