ఫ్యామిలీ.. ఫ్యామిలీ పొడుగే

ఫ్యామిలీ.. ఫ్యామిలీ పొడుగే

‘ఇంట్లో బల్బు పాడయింది. కొత్తది పెట్టాలి. అటకలో ఉన్న సామాన్లు తీసుకోవాలి...  మీ ఇంట్లో నిచ్చెన ఉంటే ఇస్తారా’ అని అడుగు తుంటారు చుట్టు పక్కల ఉండేవాళ్లు. కానీ వీళ్లకు మాత్రం నిచ్చెన అవసరమే లేదు. ఎందుకంటే..

ఇంట్లో ఒకరిద్దరు పొడవు ఉంటేనే ‘ఆ ఫ్యామిలీ వాళ్లు భలే హైట్‌‌’ అంటారు. వీళ్ల ఇంట్లో ఉన్న ఐదుగురూ పొడుగే. ఎంత? ఆరు అడుగులు ఉంటారా! అంటున్నారా. అంతకంటే ఎక్కువే. ఈ ఇంట్లో వాళ్ల యావరేజ్ హైట్‌‌ 6 అడుగులు. వీళ్ల ఇంట్లో తక్కువ పొడవు ఆరు అడుగుల మూడు అంగుళాలు మరి. అందుకే గిన్నిస్ బుక్‌‌ ఆఫ్‌‌ వరల్డ్ రికార్డ్స్‌‌లోకి ఎక్కింది వీళ్ల ఫ్యామిలీ. 

ఈ ఎత్తు కుటుంబం ఎక్కడ ఉందంటే యుఎస్ఎ, ఎస్కోలో. ఈ కుటుంబ పెద్దలు స్కాట్‌‌ ట్రాప్‌‌, క్రిస్సి ట్రాప్‌‌. స్కాట్‌‌ ఎత్తు ఆరు అడుగుల ఎనిమిది అంగుళాలు. అతని భార్య క్రిస్సి ట్రాప్​ ఆరు అడుగుల మూడు అంగుళాల ఎత్తు. తనే వీళ్ల ఇంట్లో అందరికన్నా పొట్టి అట! వీళ్లకు సవన్న, మాలీ, ఆడమ్‌‌ అని ముగ్గురు పిల్లలు. ​వీళ్లు తల్లిదండ్రుల కన్నా ఎత్తు ఉన్నారు. వీళ్లలో చిన్నవాడైన ఆడమ్‌‌ ఎత్తు అందరికన్నా ఎక్కువ. ఏడు అడుగుల మూడు అంగుళాలు. సవన్న ఎత్తు ఆరడుగుల ఎనిమిది అంగుళాలైతే, మాలీది ఆరడుగుల ఆరంగుళాలు. స్కాట్‌‌ పిల్లలంతా వాలీబాల్‌‌, బాస్కెట్‌‌బాల్‌‌ నేషనల్‌‌ ప్లేయర్స్‌‌. 

వీళ్లని అందరూ ‘మీ ఫ్యామిలీ చాలా ప్రత్యేకం. మీరంతా గిన్నిస్‌‌ రికార్డ్‌‌ కోసం ఎందుకు ట్రై చేయరు’ అని అడిగేవాళ్లు. వీళ్ల కుటుంబం మొత్తం ఎత్తు కలిపితే సగం టెన్నిస్‌‌ కోర్టు కొలతతో సమానం. అందుకే గిన్నిస్‌‌ వాళ్లను సంప్రదించి రికార్డ్‌‌ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంతో ఈ మధ్యే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌‌ రికార్డ్స్‌‌లోకి  ఎక్కింది ఈ ఫ్యామిలీ. వీళ్ల వీడియోని గిన్నిస్ బుక్ వాళ్లు ‘మీట్ టాలెస్ట్ ఫ్యామిలీ ఇన్‌‌ ది వరల్డ్’ అని క్యాప్షన్‌‌ పెట్టి ఇన్‌‌స్టాగ్రామ్‌‌ పేజీలో పోస్ట్‌‌ చేసింది.