నిర్మల్ జిల్లాలో ఘోరం జరిగింది. హైవేపై రెండు లారీలో ఢీకొనడంతో మంటలు చెలరేగి లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. గురువారం ( జూన్ 11 ) తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నిర్మల్ జిల్లాలోని మేడిపల్లి NH 44 జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. నాగ్ పూర్ నుండి ఆలుగడ్డల లోడ్ తో హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ టైర్ పంక్చర్ అవ్వడంతో మేడిపల్లి దగ్గర హైవే పక్కన లారీ ఆపాడు డ్రైవర్.
ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి జొన్నల లోడ్ తో హైదరాబాద్ కు వెళ్తున్న మరి లారీ వెనక నుంచి వేగంగా వచ్చి నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ బయటకు రాలేక సజీవదహనం అయ్యాడు. ఈ ఘటనలో మృతి చెందిన డ్రైవర్ ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలానికి చెందిన జవారి సింగ్ గా గుర్తించారు.
ఈ ఘటనపై ఫైర్ సిబ్బందికి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు ఫైర్ సిబ్బంది. ఘటన జరిగిన సమయంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
