జూబ్లీహిల్స్, వెలుగు: పుట్టుకతో రెండు కళ్లు కనిపించని పసివాడికి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ డాక్టర్లు వెలుగులు పంచారు. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన మూడు నెలల బాలుడు ఇమాద్ ‘పీటర్స్ అనోమలీ’ అనే అరుదైన కంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఈ సమస్య కారణంగా కనుపాపలు పూర్తిగా తెల్లగా ఉండి, చూపు లేకుండా పోయింది. బాలుడి రెండు కళ్లను పరిశీలించిన డాక్టర్లు రెండు కళ్లకు నల్ల గుడ్డు మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఎడమ కన్ను మరింత క్లిష్టంగా ఉండడంతో అందులో గ్లాకోమా (కంటి ఒత్తిడి) సమస్య కూడా ఉంది. దీనిని అదుపు చేసేందుకు ‘ట్రాన్స్‌స్క్లెరల్ సైక్లోఫోటోకోగ్యులేషన్’ అనే పద్ధతిని, మందులను ఉపయోగించారు.
శస్త్రచికిత్స అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువులో స్పష్టమైన మార్పు వచ్చింది. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ పీడియాట్రిక్ కార్నియా నిపుణుడు డాక్టర్ మురళీధర్ రామప్ప మాట్లాడుతూ.. పీటర్స్ అనోమలీ వంటి సమస్యల్లో చికిత్స కచ్చితంగా విజయవంతమవుతుందని చెప్పలేమన్నారు. కానీ సరైన సమయంలో శస్త్రచికిత్స చేయడం, నిరంతర పర్యవేక్షణ ద్వారా చూపు వచ్చే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. శిశువు ఎదుగుదలలో చూపు మెరుగుపడటానికి ఇది ఎంతో కీలకమైన సమయమన్నారు. సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు వారి ఆనందాన్ని పంచుకున్నారు.
