- హైడ్రా ప్రజావాణికి పలువురి ఫిర్యాదులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 59 ఫిర్యాదులు రాగా, కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వీకరించారు. అయితే, ఈసారి ఫైర్సేఫ్టీకి సంబంధించిన కంప్లయింట్స్కూడా వచ్చాయి. దుర్గంచెరువు వెళ్లే దారిలోని రోడ్ నంబర్ 45లో ఆక్సిజన్ సిలిండర్లను సెల్లార్ లో ఉంచుతున్నారని, దీంతో అగ్నిప్రమాదం జరిగే అవకాశం ఉందని పలువురు ఫిర్యాదు చేశారు.
మాదాపూర్ లో పైన హాస్టళ్లు నిర్వహిస్తూ గ్రౌండ్ ఫ్లోర్‌లో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌సెంటర్లు, క్యాంటీన్లు నడుపుతున్నారని, అక్కడి స్థానికులు ఫిర్యాదు చేశారు. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి మెయిన్రోడ్డును 6 లేన్లుగా విస్తరిస్తున్నారని, ఈ రోడ్డుకు ఆనుకుని కడుతున్న వరద కాలువను ప్రగతినగర్ మీదుగా వెళ్లే మురుగు కాలువకు అనుసంధానం చేస్తున్నారని, దీంతో వరద ముప్పు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఫిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ లోని రాజరాజేశ్వరి నగర్‌లోని పార్కు స్థలాలు, రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని అక్కడి నిర్వాసితులు ఫిర్యాదు చేశారు.
