అమెరికా లో కారు ప్రమాదం.. మధు యాష్కి భార్యకు తీవ్ర గాయాలు

అమెరికా లో కారు ప్రమాదం.. మధు యాష్కి భార్యకు తీవ్ర గాయాలు

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కి భార్య డాక్టర్ సూచి యాష్కి బుధవారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తన చిన్న కుమార్తె గగనను బోస్టెన్‌లోని హార్వర్డ్ యూనివర్శిటీ అనుబంధ కాలేజీలో ఎండీ కోర్సులో జాయిన్ చేసి న్యూయార్క్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో సూచి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న చెట్లను తాకి పల్టీలు కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. 

ఆమెకు పక్కటెముకలు విరిగినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మధు యాష్కి వెనుక కారులోనే ఉన్నారు. గురువారం ఆయన అమెరికా నుంచి హైదరాబాద్ రావాల్సి ఉంది. ప్రమాదం జరగడం వల్ల అక్కడే ఉండిపోయారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్రానికి చెందిన పలువురు నేతలు మధు యాష్కికి ఫోన్ చేసి పరామర్శించారు.