న్యూఢిల్లీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నూతన కేంద్ర విద్యాశాఖ మంత్రి నియామకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. తాత్కాలికంగా విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించినప్పటికీ నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో కొత్త విద్యాశాఖ మంత్రి నియామకంపై కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే విద్యాశాఖ మంత్రి రేసులో ఉన్నట్లు జాతీయ మీడియాలు కథనాలు వస్తున్నాయి. వీరిలో ఒకరికి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇందులో భాగంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన వెంటనే ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీపై సీఎం ఫడ్నవీస్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం (జులై 26) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం ఉందన్న ఊహాగానాలను ఫడ్నవీస్ తోసిపుచ్చారు. తాను రాష్ట్రంలోనే సేవలు కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తాను కేంద్ర కేబినెట్లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తానన్న ఊహాగానాల్లో నిజం లేదని కుండబద్దలు కొట్టారు. తన దృష్టి మహారాష్ట్రపైనే ఉందని.. తాను మహారాష్ట్రలోనే ఉంటానని తేల్చిచెప్పారు. ఫడ్నవీస్ క్లారిటీతో విద్యాశాఖ మంత్రి రేసులో ఆయన లేరని విషయం తేటతెల్లమైంది.
ధర్మేంద్ర ప్రధాన్ ఔట్.. బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జోషి:
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం (జులై 26) బాధ్యతలు స్వీకరించారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో ప్రధాని మోడీ సలహా మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రహ్లాద్ జోషిని తాత్కాలిక విద్యా శాఖ మంత్రిగా నియమించారు. ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం (జులై 26) బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం కేంద్ర వినియోగదారులు, ఆహార సరఫరా శాఖ మంత్రిగా ఉన్న జోషి.. ఆ శాఖలతో పాటు విద్యాశాఖ బాధ్యతలను కూడా నిర్వర్తించనున్నారు.
