సంగారెడ్డి ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి.. రూ. 6.5 కోట్ల డ్రగ్స్ మెటీరియల్ సీజ్!

సంగారెడ్డి ఫామ్‌హౌస్‌పై పోలీసుల దాడి.. రూ. 6.5 కోట్ల డ్రగ్స్ మెటీరియల్ సీజ్!

తెలంగాణలో మరోసారి భారీగా డ్రగ్స్ కలకలం రేపింది. ఎవరూ ఊహించని విధంగా ఓ మారుమూల గ్రామంలోని ఫామ్‌హౌస్ వేదికగా సాగుతున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఈ ఆపరేషన్ స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

నమ్మకమైన సమాచారంతో పీచేర్యాగడి తండాలోని రెండెకరాల విస్తీర్ణంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్‌పై మహారాష్ట్ర పోలీసులు అకస్మాత్తుగా మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో ఫామ్‌హౌస్‌లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ తయారీ ల్యాబ్ చూసి అధికారులు సైతం షాక్‌కు గురయ్యారు. అక్కడ లభించిన సుమారు 3 కిలోల మెఫెడ్రోన్ డ్రగ్‌తో పాటు, డ్రగ్స్ తయారీకి పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన కెమికల్స్, ముడిపదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ స్వాధీనం చేసుకున్న ముడిపదార్థాల విలువ దాదాపు 6.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో  ఈ ముఠా డ్రగ్స్ తయారీకి కావాల్సిన ముడిపదార్థాలను నేరుగా ముంబై నుంచి ఇక్కడికి తరలిస్తున్నట్లు తేలింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండటానికే హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల ఫామ్‌హౌస్‌ను అడ్డాగా మార్చుకున్నారు. ఇక్కడ డ్రగ్స్ తయారు చేసి, తిరిగి వాటిని ముంబైతో పాటు ఇతర మెట్రో నగరాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ అక్రమ డ్రగ్స్ తయారీ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్న ముగ్గురు నిందితులను మహారాష్ట్ర పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని ముంబైకి తరలించారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? తెలంగాణలో వీరికి ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.