
హైదరాబాద్, వెలుగు: ఫ్యాన్స్ తో సినీనటుడుమహేశ్బాబు నిర్వహించిన ఫొటోషూట్ రసాభాసగా మారింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు మహేశ్ బాబుతో ఫొటో దిగేందుకు ఎగబడ్డారు. బౌన్సర్లు, అభిమానుల మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరు అభిమానులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం శేరిలింగంపల్లి ఆల్మండ్ ఫ్యాక్టరీలో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా షూటింగ్ చివరి రోజులో భాగంగా హీరో మహేశ్‌బాబు తో వెయ్యి మంది అభిమానుల ఫొటోషూట్ కు ఏర్పాట్లు చేశారు. దీని కోసం మొదట తెలంగాణ, ఏపీకి చెందిన 12 మంది మహేశ్‌బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులకు పాస్‌లు జారీ చేశారు.
ఒక్కో అధ్యక్షుడికి 100 నుంచి 120 పాస్‌లు ఇచ్చారు. ఉదయం 10 గంటల సమయంలో అనుకున్న సంఖ్య కంటే ఎక్కువ మంది ఫ్యాన్స్ తరలివచ్చారు. మహేశ్‌బాబుతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. బౌన్సర్లు వారిని నిలువరించే క్రమంలో తోపులాట జరిగింది. ఇద్దరు అభిమానులకు గాయాలయ్యాయి. వారిని ప్రైవేటు హాస్పిటల్ కు తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న చందానగర్ పోలీసులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
పర్మిషన్ తీసుకోలేదు: చందానగర్ ఇన్ స్పెక్టర్ రవీందర్
మహేశ్ బాబుతో ఫ్యాన్స్ ఫొటోషూట్ కు ఏకే ఎంటర్ టైన్ మెంట్ నిర్వాహకులు ఎలాంటి అనుమతి తీసుకోలేదని చందానగర్ ఇన్ స్పెక్టర్ రవీందర్ తెలిపారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో తోపులాట జరిగినట్లు చెప్పారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.