హైదరాబాద్, వెలుగు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముమ్మాటికీ ఆంధ్రా నేతనే అని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. జనసేన పార్టీ పుట్టిందే అక్కడ అని, ఆంధ్రా నాయకుడికి ఆంధ్రా మూలాలే ఉంటాయన్నారు. ఆ మూలాలు ఉన్న వ్యక్తి తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడి ప్రజలకు ఎలా న్యాయం చేయగలడని ప్రశ్నించారు. మంగళవారం గాంధీ భవన్‌లో మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు.
పవన్ కల్యాణ్‌ను తాము ఓ సినిమా యాక్టర్‌గానే చూస్తామన్నారు. కొండగట్టు అంజన్న అందరికీ ఆరాధ్య దైవమని, పవన్‌కు కూడా అంతేనని వ్యాఖ్యానించారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్‌ఎస్ చీఫ్ కవితకు జయ శంకర్ కనిపించలేదా?..ఇప్పుడు ఆయన విగ్రహాలు అంటూ ప్రస్తావించడమేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిలించిందే జయశంకర్ అని, ఆయన అంటే కాంగ్రెస్ పార్టీకి ఎనలేని గౌరవం ఉన్నదని స్పష్టం చేశారు. కేసీఆర్‌తో బీజేపీ కుమ్మక్కవడం వల్లనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు డిజైన్‌ను మార్చి, లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ను నమ్మడం లేదని, తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ దే అధికారం అని ధీమా వ్యక్తంచేశారు.
సోనియాగాంధీ దృఢ సంకల్పంతోనే తెలంగాణ
గాంధీ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహేశ్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. సోనియాగాంధీ సంకల్పంతోనే తెలంగాణ వచ్చిందని అన్నారు. ఎన్నో ఏండ్ల నిరీక్షణ, ఎంతో మంది త్యాగధనులతో తెలంగాణ ఏర్పడిందని చెప్పారు. బంగారు తెలంగాణ అన్నవారి కుటుంబం మాత్రమే బంగారం అయిందని, రాష్ట్రం మాత్రం అప్పుల కుప్పగా మారిందని బీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. బీజేపీ నాయకులు ప్రజలను మభ్యపెట్టడం తప్ప, చేసేదేమీ లేదని అన్నారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే మళ్లీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని, అధికారంలోకి వస్తామని అన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా పాలన సాగుతున్నదని చెప్పారు. పేదవాడి అభ్యున్నతి ధ్యేయంగా ముందుకు వెళ్తామన్నారు.
