టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతినిధుల నియామకం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతినిధుల నియామకం : పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
  •     కొత్త ఒరవడికి రాహుల్  శ్రీకారం చుట్టారన్న పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికార ప్రతినిధుల నియామకానికి టాలెంట్ హంట్ పేరుతో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రాజకీయాల్లో ఈ కొత్త ఒరవడితో ప్రతిభ ఉన్న వారికి మంచి అవకాశాలు దక్కనున్నాయని చెప్పారు. సోమవారం గాంధీ భవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. జాతీయ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన ఉన్నవారిని గుర్తించి ఎంపిక చేస్తారని, పార్టీలకతీతంగా టాలెంట్ హంట్ పేరుతో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొన్నారు. 

రాజకీయాలకు వచ్చి సమాజసేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తులను అధికార ప్రతినిధులుగా ఎంపిక చేయడం జరుగుతుందని వివరించారు. లౌకికవాదంపై పట్టున్న వారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ టాలెంట్ హంట్ పేరుతో అధికార ప్రతినిధులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. దేశంలోని యువతకు రాజకీయంగా అపారమైన అవకాశాలు కల్పించడంలో భాగంగానే ఈ టాలెంట్ హంట్ అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్​లోని గాంధీభవన్​లో ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహేశ్ గౌడ్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ వైపు దళితులు ఆకర్షితులయ్యేలా నాయకులు కృషి చేయాలని సూచించారు.