ఫోన్ ట్యాపింగ్ తో బ్లాక్మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నరు: మహేశ్ కుమార్ గౌడ్

ఫోన్ ట్యాపింగ్  తో  బ్లాక్మెయిల్ చేసి వాటాలు  రాయించుకున్నరు: మహేశ్ కుమార్ గౌడ్
  • ఫోన్ ట్యాపింగ్​ను గత బీఆర్ఎస్ సర్కార్ 
  • వెపన్​గా వాడింది: మహేశ్ కుమార్ గౌడ్
  • సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టలేదు
  • చెల్లె ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ జవాబివ్వలేదు
  • కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్​ను ఎందుకు విచారించట్లేదు?
  • కేంద్ర మంత్రులు సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్​

హైదరాబాద్, వెలుగు: వ్యాపారులు, నేతలను లొంగదీసుకునేందుకు గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంగా వాడుకున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఎంతో మంది వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేసి వాటాలు రాయించుకున్నారని కేటీఆర్, హరీశ్ పై మండిపడ్డారు. చివరకు సొంత పార్టీ లీడర్లు హంపీలో దావత్ చేసుకుంటే.. ట్యాపింగ్ ద్వారా అక్కడ జరిగిన సమాచారాన్ని తెలుసుకున్న నీచ చరిత్ర బీఆర్ఎస్ ది అని నిప్పులు చెరిగారు. సొంత చెల్లి కవిత ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసినా వాటికి జవాబు ఇవ్వలేని కేటీఆర్..ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సీఎల్పీలో శుక్రవారం మహేశ్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ‘‘సినీ తారల ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? బీఆర్ఎస్ నేతలది అలీబాబా 40 దొంగల బ్యాచ్. కేసీఆర్ ఫ్యామిలీ అంతా స్టువర్టుపురం దొంగల ముఠా. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ ను ఈడీ, సీబీఐ ఎందుకు విచారించడం లేదో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి’’అని మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు.

సింగరేణిలో అవినీతిపై చర్చిస్తాం


పదేండ్లలో సింగరేణిలో జరిగిన అవినీతిపై పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ)లో చర్చిస్తామని మహేశ్ గౌడ్ చెప్పారు. ‘‘మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. మరి వారి హయాంలో వేసిన సిట్ పై చర్యలు ఏమయ్యాయి? ఇంటర్ క్వశ్చన్ పేపర్ల లీక్​పై సిట్ వేశారు. డ్రగ్స్ కేసులపై సిట్ వేశారు. మరి వాటిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? కేసీఆర్ ఫ్యామిలీలో ఆస్తుల గొడవతోనే కవిత బయటకు వచ్చారు. ఆత్మగౌరవ పోరాటం అని కవిత చెప్తున్నా.. ముమ్మాటికీ అసలు సమస్య ఆస్తులే. ఆమె కాంగ్రెస్ లోకి వస్తానంటే ముందు వద్దు అనేది నేనే. కాంగ్రెస్​లో ఎంతో మంది సమర్థులు ఉన్నరు’’అని మహేశ్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్ ను మారుస్తున్నారన్న వార్తలన్నీ ఫేక్ అని తెలిపారు. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పై చేసిన కామెంట్లపై పీసీసీ ఆరా తీస్తున్నదని, పీసీసీ ఉపాధ్యక్షుడి ఆధ్వర్యంలో దీనిపై విచారణ జరుగుతున్నదని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. గాంధీ భవన్​కు రావడంపై స్పందిస్తూ.. తమ పార్టీ ఆఫీస్ దేవాలయం లాంటిదని చెప్పారు. పార్టీ అసోసియేట్ సభ్యులు ఎవరైనా గాంధీ భవన్ కు రావొచ్చని తెలిపారు. బండ్ల గణేష్ పాదయాత్రపై మాట్లాడుతూ.. ఆయనకు కాంగ్రెస్ లో సభ్యత్వం ఉండేదని, మరి ఇప్పుడు దాన్ని రెన్యూవల్ చేయించుకున్నాడో లేదో తెలీదన్నారు.

ఫోన్ ట్యాపింగ్.. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కాదా?

ఇద్దరు ఫోన్​లో మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినట్లు కాదా..? అని కేటీఆర్​ను మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. కేటీఆర్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ‘‘రాజ్యాంగం ప్రకారమే విచారణ సాగుతున్నది. తమ ప్రభుత్వానికి రాజకీయ కక్షసాధింపు ధోరణి ఉంటే.. అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే వాళ్లం. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆరిపోకుండా “ఆరనీకుమా ఈ దీపం కార్తీక దీపం”అన్నట్లు సిట్ పై కేటీఆర్ రాగాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ కేసులతో ఫోన్ ట్యాపింగ్ కేసును పోల్చడం ఏంటి? ట్యాపింగ్ అనేది చాలా తీవ్రమైన నేరం. దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై మాత్రమే ఫోన్ ట్యాపింగ్ ను ప్రయోగిస్తారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుపుతున్నానని నాపై నిఘా పెట్టి ఫోన్ ట్యాప్ చేశారు’’అని
మహేశ్ గౌడ్ అన్నారు.