సదర్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

సదర్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

ఖైరతాబాద్, వెలుగు: యాదవులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సదర్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఖైరతాబాద్ సదర్ ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ మహేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్​లోని మహంకాళి ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సదర్​ను రాష్ట్ర పండుగగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది  సిటీలో సదర్ ఉత్సవాలు ఖైరతాబాద్ నుంచే మొదలవుతాయన్నారు.

ఈ నెల 26న ఖైరతాబాద్​లో సదర్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని.. చీఫ్ గెస్టులుగా మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, బేవరెజెస్ చైర్మన్ గజ్జెల నాగేశ్, మేయర్ విజయలక్ష్మి, కార్పొరేటర్ విజయారెడ్డి హాజరవుతారన్నారు. అదే రోజు రాత్రి 7 గంటలకు బడా గణేశ్ ఏరియా నుంచి రైల్వే గేట్ వరకు దున్నరాజుల ప్రదర్శన ఉంటుందన్నారు. నాంపల్లి, పురానా పూల్​తో పాటు సిటీలోని చాలా ప్రాంతాల నుంచి దున్నపోతులను ప్రదర్శనకు వస్తాయన్నారు. సమావేశంలో సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు  లక్ష్మణ్ యాదవ్, మధుకర్ యాదవ్, సుధాకర్, శ్రీనివాస్ యాదవ్, వినోద్ యాదవ్ పాల్గొన్నారు.